మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 00:23:55

వరల్డ్‌ కప్‌ వాయిదా!

వరల్డ్‌ కప్‌ వాయిదా!

  • వచ్చే వారం అధికారిక ప్రకటన
  • ఐసీసీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి 

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా     పడబోతుందా. అంటే అవుననే సమధానం వినిపిస్తున్నది. కరోనా వైరస్‌ అంతకంతకూ ప్రభావం చూపిస్తుండటంతో మెగా టోర్నీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. 16 జట్లతో కూడిన ప్రపంచకప్‌ నిర్వహించే విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా   (సీఏ) సన్నద్ధతపై అనుమనాలు బలపడుతున్నాయి. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు క్వారంటైన్‌ కల్పించడంతో పాటు ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించే విషయంలో సీఏ మల్లగుల్లాలు పడుతున్నది. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం టీ20 ప్రపంచకప్‌ జరుగుతుందా లేదా అన్న దానిపై వచ్చే వారం కీలక నిర్ణయం వెలువడనున్నది. 

ముంబై: ప్రమాదకర కరోనా వైరస్‌ ఖాతాలో మరో క్రీడా టోర్నీ చేరబోతున్నదా. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అనుమానాలన్నీ బలపడుతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 18 నుంచి మొదలుకావాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదాపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్‌ భేటీలో ఎజెండాలోని మూడు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇందులో వరల్డ్‌కప్‌ వాయిదాతో పాటు శశాంక్‌ మనోహర్‌ పదవీ విరమణతో ఖాళీ అవుతున్న చైర్మన్‌ స్థానానికి నామినేషన్‌ తుది గడువు, ఎన్నికల తేదీ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. 

ఆస్ట్రేలియా సన్నద్ధతపైనే  

టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ క్రికెట్‌ ఆస్ట్రేలియా సన్నద్ధతపై ఆధారపడి ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు సెప్టెంబర్‌ ఆఖరి వరకు దేశ సరిహద్దులను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించింది. మెగాటోర్నీలో పాల్గొనే 16 జట్ల సభ్యులకు క్వారంటైన్‌ సౌకర్యానికి తోడు ఒకచోటు నుంచి మరొక చోటుకు తరలించడం, హోటల్‌ సౌకర్యాల కల్పనపై సీఏ ఆలోచిస్తున్నది. దీనికి తోడు ఒకవేళ ఖాళీ స్టేడియాల్లో టోర్నీ నిర్వహించాల్సి వస్తే సీఏ.. చాలా వరకు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆతిథ్య, ప్రాతినిధ్యం విషయంలో దక్కే నగదు తప్ప.. సీఏకు పెద్దగా లాభం ఉండకపోవచ్చు. ప్రపంచకప్‌ను వాయిదా వేస్తే బెటర్‌ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ మధ్య తరుచూ వ్యాఖ్యానించడం నిర్వహణపై సందేహాలు కల్గిస్తున్నది. 

ఐపీఎల్‌కు అవకాశం 

ఒక వేళ ప్రపంచకప్‌ వాయిదా పడితే అక్టోబర్‌-నవంబర్‌ విండో ఖాళీగా ఉంటుంది. ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఐపీఎల్‌ నిర్వహించుకునేందుకు బీసీసీఐకి మంచి అవకాశం. మొత్తం ఆదాయాన్ని కోల్పోయే బదులు ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకైనా బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఇదంతా అనేక అంశాలపై ఆధారపడి ఉంది. కొవిడ్‌-19 వ్యాప్తి, ప్రభుత్వ అనుమతి, వివిధ దేశాల క్రికెటర్లకు ప్రయాణ పర్మిషన్‌ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

మూడు అంశాలపై చర్చ 

  • వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చికి ప్రపంచకప్‌ టోర్నీని వాయిదా వేస్తే సీఏ అందుకు ఒప్పుకోకపోవచ్చు. వరల్డ్‌ కప్‌ జరిగిన వెంటనే ఏప్రిల్‌లో ఐపీఎల్‌ మొదలవుతుంది. దీంతో క్రికెటర్లు టీ20లతో విసిగిపోతారు. భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటన సందిగ్ధంలో పడుతుంది.  
  • వరల్డ్‌కప్‌ షెడ్యూల్ల(2020, 2021) ను మార్చుకునే విషయంలో బీసీసీఐ ఒప్పుకునే అవకాశం లేదు. ఈ ఏడాది ఆఖర్లో జరుగాల్సిన భారత పర్యటన కోసం బీసీసీఐతో సీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నది. 
  • మెగాటోర్నీని 2022కు వాయిదా వేస్తే.. ఆటగాళ్లందరికీ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ ఏడాది ఏ ఐసీసీ టోర్నీ లేకపోవడం సీఏకు కలిసి వచ్చే అంశం. 


logo