దుబాయ్: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక ‘థీమ్ సాంగ్’ను విడుదల చేసింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది కంపోజ్ చేసిన ఈ పాటకు.. యానిమేషన్ క్యారెక్టర్లను పోలిన క్రికెటర్ల బొమ్మలను జతచేసింది. ‘లైవ్ ది గేమ్.. లవ్ ది గేమ్’ థీమ్‌తో ప్రపంచవ్యాప్త అభిమానులు ఆటను ఆస్వాదిస్తున్నట్లు రూపొందించిన ఈ వీడియోలో.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, విండీస్ ఆల్‌రౌండర్ పొలార్డ్, ఆసీస్ స్టార్ మ్యాక్స్‌వెల్, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్‌ను పోలిన ‘అవతార్’ యానిమేషన్ బొమ్మలు మైదానంలో సందడి చేస్తున్నాయి. భారత ఆతిథ్యంలో యూఏఈ, ఒమన్ వేదికలుగా అక్టోబర్ 17 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.