గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 19, 2020 , 23:37:22

22 నుంచి టీపీకేఎల్‌ మూడో సీజన్‌

22 నుంచి టీపీకేఎల్‌ మూడో సీజన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: గ్రామీణ క్రీడ కబడ్డీకి మన దేశంలో ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. పసి వయసు నుంచి పండు ముసలి వరకు కబడ్డీ అంటే అమితమైన ఆసక్తి కనబరిచే వాళ్లే. కార్పొరేట్‌ హంగులు అద్దుకున్న కబడ్డీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశంతో మొదలైన తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌(టీపీకేఎల్‌) మూడో సీజన్‌ ఈనెల 22 నుంచి మొదలుకాబోతున్నది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియం వేదికగా మార్చి 14 వరకు టీపీకేఎల్‌ పోటీలు జరుగనున్నాయి. 


బుధవారం ఓ హోటల్‌ వేదికగా  టీపీకేఎల్‌ మూడో సీజన్‌లో బరిలోకి దిగుతున్న ఎనిమిది జట్ల పరిచయ కార్యక్రమం జరిగింది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ సహకారంతో చింతల స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మద్దతునిస్తుండగా, సిల్లి మాంక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీపీకేఎల్‌ను సమర్పిస్తున్నది. ఈ లీగ్‌లో కొత్తగా సైబరాబాద్‌ చార్జర్స్‌ చేరగా, డిఫెండింగ్‌ చాంపియన్స్‌ వరంగల్‌ వారియర్స్‌, నిరుటి రన్నరప్‌ కరీంనగర్‌ కింగ్స్‌, గద్వాల్‌ గ్లాడియేటర్స్‌, రంగారెడ్డి రైడర్స్‌, హైదరాబాద్‌ బుల్స్‌, నల్లగొండ ఈగల్స్‌, మంచిర్యాల్‌ టైగర్స్‌ టైటిల్‌పై కన్నేసాయి. కార్యక్రమంలో  తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్‌, టీపీకేఎల్‌ కమిషనర్‌ సంజయ్‌ రెడ్డి, లీగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి, ఫ్రాంచైజీల యజమానులు పాల్గొన్నారు. 


logo