బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Jan 30, 2021 , 00:47:15

బరోడా x తమిళనాడు

బరోడా x తమిళనాడు

  • ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ ఫైనల్‌లో ఇరు జట్లు  

అహ్మదాబాద్‌: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఫైనల్‌కు తమిళనాడు, బరోడా దూసుకెళ్లాయి. శుక్రవారం ఇక్కడి మొతెరా స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో తమిళ జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై గెలువగా.. రెండో సెమీస్‌లో బరోడా 25 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తుచేసింది. ఆదివారం జరిగే తుదిపోరులో టైటిల్‌ కోసం ఇరు జట్లు తలపడనున్నాయి. 

మెరిసిన అరుణ్‌ కార్తీక్‌ 

తొలి సెమీస్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్‌ అశోక్‌ మనేరియా (51), అర్జిత్‌ గుప్తా (45) రాణించారు. తమిళ బౌలర్‌ ఎం.మహమ్మద్‌ (4/24) కట్టడి చేయడంతో రాజస్థాన్‌ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్యఛేదనలో టాప్‌-3 బ్యాట్స్‌మన్‌ విఫలమైనా.. అరుణ్‌ కార్తీక్‌ (54 బంతుల్లో 89 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెచ్చిపోయాడు. అతడికి తోడు కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (17 బంతుల్లో 29) అదరగొట్టడంతో మరో 8 బంతులు ఉండగానే తమిళ జట్టు గెలిచి, వరుసగా రెండోసారి ముస్తాక్‌ అలీ ఫైనల్‌ చేరింది. 


బరోడా ఆల్‌రౌండ్‌ షో 

రెండో సెమీస్‌లో పంజాబ్‌పై బరోడా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. కెప్టెన్‌ కేదర్‌ దేవ్‌ధర్‌ (64), కార్తీక్‌ కాకడే (53) అర్ధశతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 160 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్‌ మన్‌దీప్‌ సింగ్‌ (42 నాటౌట్‌), గుర్‌కీరత్‌ సింగ్‌ (39) మినహా మిగిలిన వారు విఫలమవడంతో పంజాబ్‌ 8 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. బరోడా బౌలర్లలో లుక్మన్‌ మరీవాలా మూడు, నినాద్‌ రత్వా రెండు వికెట్లు పడగొట్టారు.


VIDEOS

logo