ఆటంటే ఇదేరా!

- భారత ఆటగాళ్ల అసమాన పోరాటం
- పంత్, పుజార వీరోచిత ప్రదర్శన
- విహారి, అశ్విన్ మారథాన్ ఇన్నింగ్స్
- డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు
- చేష్టలుడిగిన ఆస్ట్రేలియా ప్లేయర్లు
- 97ఓవర్లు, 236 పరుగులు, 3 వికెట్లు
అద్భుతం, అద్వితీయం, అనన్య సామాన్యం, అపూర్వం ఇలా.. ఎంత వర్ణించినా టీమ్ఇండియా పోరాటం ముందు తక్కువే అవుతుంది. సిడ్నీ మైదానం.. కఠినంగా మారిన చివరి రోజు పిచ్.. శరీరాలనే లక్ష్యంగా చేసుకుంటూ ఆసీస్ పేసర్ల అరివీర భయంకర బౌన్సర్లు.. వీటన్నింటినీ అభేద్యమైన ఆటతో మనవాళ్లు తిప్పికొట్టిన తీరు టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. కసి, పట్టుదల, ధైర్యం, సహనంతో పంత్, విహారి, పుజార, అశ్విన్.. ఆస్ట్రేలియాను భయపెట్టి మూడో టెస్టును డ్రా చేసిన విధానం చిరస్మరణీయంగా ఉండిపోతుంది. అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను మనవాళ్లు ప్రపంచానికి మరోసారి చూపారు.
‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది’ అన్న సినిమా డైలాగ్‌ను గుర్తుచేసేలా టీమ్ఇండియా రెచ్చిపోయింది. గాయాలు వేధిస్తున్నా పంత్, విహారి, అశ్విన్ ముగ్గురూ అద్భుతంగా పోరాడారు. మోచేతి దెబ్బతో బరిలోకి దిగిన పంత్ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తే..తొడకండరాలు పట్టుకుపోయినా విహారి అసామాన్య పోరాట పటిమ చూపాడు. వెన్నునొప్పితో ఉన్న అశ్విన్ అద్భుతమే చేశాడు. వేలు విరిగినా జట్టు కోసం ఆడేందుకు జడేజా సిద్ధపడ్డాడు.
స్టాండ్స్‌లో నుంచి ఆసీస్ అల్లరి మూక జాత్యహంకార వ్యాఖ్యలు.. మైదానంలో ఆతిథ్య కెప్టెన్ పైన్ స్లెడ్జింగ్‌కు టీమ్ఇండియా గట్టిబుద్ధి చెప్పింది. పొగరును అణచివేసింది. నైతికంగా, మానసికంగా కంగారూలను ఘోరంగా ఓడించింది. భారత్‌కు ఓటమి తప్పదని పదేపదే అంటున్న పాంటింగ్ లాంటి ఆసీస్ మాజీల నోళ్లకు తాళం వేసింది.
సిడ్నీ: టీమ్ఇండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆసీస్ గడ్డపై కఠినతరమైన ఐదో రోజు పిచ్‌పై ఆసాంతం నిలిచి ఔరా అనిపించింది. ఇక ఓటమి తప్పదేమో అనుకునే స్థితిలో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్ (118 బంతుల్లో 97), చతేశ్వర్ పుజార (205 బంతుల్లో 77), తెలుగు ఆటగాడు హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్) అనన్యసామాన్య పోరాటం చేశారు. దీంతో సోమవారం చివరి రోజు 97 ఓవర్లలో కేవలం మూడు వికెట్లే కోల్పోయిన టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో మూడో టెస్టును సమం చేసుకుంది. ఓ దశలో పంత్ జోరుతో ఓటమి భయంతో బెంబేలెత్తిన ఆసీస్ ఆటగాళ్లు.. పుజార, విహారి, అశ్విన్ సహనానికి దాసోహమైపోయారు. 407 పరుగుల లక్ష్యంతో 98/2 ఓవర్ నైట్ స్కోరు వద్ద చివరి రోజు బరిలోకి దిగిన టీమ్ఇండియా మరో 236 పరుగులు చేసింది. మొత్తంగా 131 ఓవర్లలో ఐదు వికెట్లకు 334 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో ఉంది. టెస్టుల్లో అజేయ కెప్టెన్‌గా అజింక్య రహానే రికార్డు పదిలమైంది. ఇక ఆసీస్ బౌలర్లు తీవ్రంగా చెమటోడ్చగా హజిల్‌వుడ్, లియాన్ చెరో రెండు, పాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసిన ఆస్ట్రేలియా సీనియర్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మక మ్యాచ్ బ్రిస్బేన్‌లో 15 నుంచి జరుగనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాలను నిలుపుకున్నాయి.
విహారి, అశ్విన్ అద్భుత పోరాటం
పంత్, పుజార నిష్క్రమణ తర్వాత విహారి, అశ్విన్ ప్రదర్శించిన సహనం, కసి అమోఘం. అప్పటికే కండరాలు పట్టేయడంతో ఇబ్బందులు పడుతున్న విహారి, వెన్నునొప్పితో ఉన్న అశ్విన్ గొప్ప పోరాట పటిమ ప్రదర్శించారు. ఆసీస్ పేసర్లు కమిన్స్, స్టార్క్, హజిల్‌వుడ్ వేగవంతమైన బౌన్సర్లు సంధిస్తున్నా అడ్డుకున్నారు. చివరికి మ్యాచ్‌ను కాపాడేందుకు బంతులకు శరీరాలను కూడా అడ్డుపెట్టేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో అశ్విన్ పక్కెటెముకల గాయానికి గురైనా ఆటను కొనసాగించాడు. విహారి, అశ్విన్ పెయిన్ కిల్లర్లు తీసుకొని మరీ చివరి సెషన్లోనూ అదరగొట్టారు. ఓ వైపు వికెట్ల వెనుక నుంచి ఆసీస్ కెప్టెన్ పైన్ ప్రేలాపనలు చేసినా.. ఏకాగ్రత కోల్పోని అశ్విన్ అద్భుతం చేశాడు. ‘నీకు ఇదే చివరి సిరీస్ ఏమో’ అని పైన్‌కు ధాటిగా బదులిచ్చాడు. విహారి తొలి 100 బంతుల్లో 6 పరుగులే చేసి టెస్టుల్లో క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. ‘ఆడు మామా ఆడు’ అంటూ విహారిలో అశ్విన్ ఉత్సాహాన్ని నింపాడు. మొత్తంగా అత్యంత కఠిన పరిస్థితుల్లో వారిద్దరూ అజేయంగా 42.4 ఓవర్లు ఆడి చివరి వరకు నిలిచి 62 పరుగులు జోడించారు. టెస్టు చరిత్రలోనే ఒకానొక గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుందన్నట్టు వారికి కొన్ని అవకాశాలూ కలిసివచ్చాయి. అంత కష్టపడి మ్యాచ్‌ను కాపాడాక చిరునవ్వుతో కండ్లలో మెరుపులు మెరిపించారు. మొత్తంగా భారత టెస్టు దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు 48వ పుట్టిన రోజున టీమ్ఇండియా బహుమతి ఇచ్చింది.
గెలుపుపై ఆశలు రేగినా..
లంచ్ విరామం తర్వాత కూడా పంత్ దూకుడుగా ఆడాడు. కొత్త బంతి తీసుకునే ముందు నాలుగు ఫోర్లతో అతడు రెచ్చిపోగా.. పుజార సైతం స్ట్రోక్ ప్లే చూపాడు. ఈ క్రమంలో 170 బంతుల్లో పుజార అర్ధశకతం చేశాడు. అయితే శతకానికి మూడు పరుగుల దూరంలో లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన రిషబ్.. కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే పుజార సైతం హజిల్‌వుడ్ అద్భుత బంతికి బౌల్డయ్యాడు. దీంతో మ్యాచ్‌పై మళ్లీ ఉత్కంఠ రేగింది. మొత్తంగా వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 265 బంతులు ఆడి 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
పంత్ వీరవిహారం
ఐదో రోజు టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ అజింక్య రహానే (4) రెండో ఓవర్లోనే ఆసీస్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత పుజార, పంత్ సహనంగా ఆడారు. తొలి 35 బంతులు ఎంతో ఆచితూచి ఆడిన పంత్ ఒక్కసారిగా జూలువిదిల్చాడు. లియాన్ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దూకుడుగా క్రీజును వదిలి వస్తూ అతడి లెంగ్త్‌ను కుదురుకోనివ్వలేదు. మరో రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో 64 బంతుల్లోనే పంత్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో తన మార్క్ ఆటతో పుజార ముందుకుసాగాడు. ఈ క్రమంలో పుజార టెస్టుల్లో 6వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఐదుగురు ఫీల్డర్లు బౌండరీల దగ్గర నిలబడ్డారంటే పంత్ ఎంత దూకుడు ప్రదర్శించాడో అర్థమవుతుంది. దీంతో తొలి సెషన్‌ను 206/3 వద్ద పటిష్ట స్థితిలో నిలిచింది.
3
నాలుగో ఇన్నింగ్స్‌లో 130కి పైగా ఓవర్లు ఆడడం టీమ్ఇండియాకు ఇది నాలుగోసారి. చివరగా 1979లో పాకిస్థాన్‌పై భారత్ ఈ ఫీట్ సాధించగా.. నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ కాపాడుకునేందుకు ఎక్కువ ఓవర్లు ఆడిన ఆసియా జట్టుగానూ టీమ్ఇండియా నిలిచింది.
6
తన తొలి 100 బంతుల్లో విహారి చేసిన వరుగులు ఇవి. ఈ వ్యవధిలో అతడు ఒక్క బౌండరీ కూడా బాదకపోవడం విశేషం.
స్మిత్ మోసపూరితంగా!
బాల్ ట్యాంపరింగ్ మచ్చ ఇంకా చెరిగిపోకముందే ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ మరోసారి కుట్ర బుద్ధి చూపించాడు. రెండో సెషన్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో పంత్ బ్యాటింగ్ గార్డును చెరిపివేసేందుకు ప్రయత్నించాడు. పంత్ ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు క్రీజు వద్దకు వచ్చి మార్కులను కాలితో తుడిచేశాడు. ఇది స్టంప్ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ‘ఇంకా మారలేదా.. చీటర్ స్మిత్' అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
మీ పోరాటం అసమానం
వారెవ్వా అద్భుతమైన మ్యాచ్. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో మనవాళ్లు చూపించిన తెగువ, పట్టుదల, పోరాటం భారత క్రికెట్ జట్టుకు ప్రతిరూపం. గాయాలు, జాత్యహంకార వ్యాఖ్యలు ఇవేవి స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి. హనుమ విహారి, అశ్విన్ మీ అసమాన ప్రదర్శన చూసి గర్విస్తున్నాను’
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి
ఇప్పటికైనా తెలిసి ఉంటుంది
జట్టులో చతేశ్వర్ పుజార, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ ఉండడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసి ఉంటుందని ఆశిస్తున్నా. టీమ్ఇండియా అద్భుతంగా పోరాడింది. సిరీస్ గెలిచే సమయం వచ్చింది.
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఇది విజయమే
ఇది టెస్టు మ్యాచ్ గెలిచిన దాంతో సమానమే. విదేశాల్లో ఇలాంటి ప్రదర్శన చేయడమంటే మంచి విజయం సాధించడమే. విహారి ఆట నాకు ప్రత్యేకంగా అనిపించింది. వెస్టిండీస్‌పై సెంచరీ కన్నా అతడిది ఇదే గొప్ప ప్రదర్శనగా నేను భావిస్తా.
- అజింక్య రహానే, టీమ్ఇండియా కెప్టెన్
నా వల్లే ఇలా..
నేను మూడు క్యాచ్‌లు వదిలేయడం పట్ల తీవ్ర నిరుత్సాహంతో ఉన్నా. మా బౌలర్లు సృష్టించిన అవకాశాలను చేజార్చా. ఇండియా అద్భుతంగా పోరాడింది. ఈ ఫలితానికి వారు అర్హులు. నేను నా భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించా’
- టిమ్ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 338; భారత్ తొలి ఇన్నింగ్స్ 244; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 312/6 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) కమిన్స్ 52, శుభ్‌మన్ గిల్ (సి) పైన్ (బి) హజిల్‌వుడ్ 31, పుజార (బౌల్డ్) హజిల్‌వుడ్ 77, రహానే (సి) వేడ్ (బి) లియాన్ 4, పంత్ (సి) కమిన్స్ (బి) లియాన్ 97, హనుమ విహారి (నాటౌట్) 23, అశ్విన్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 131 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు; వికెట్ల పతనం 1-71, 2-92, 3-102, 4-250, 5-272; బౌలింగ్: స్టార్క్ 22-6-66-0, హజిల్‌వుడ్ 26-12-39-2, కమిన్స్ 26-6-72-1, లియాన్ 46-17-114-2, గ్రీన్ 7-0-31-0, లబుషేన్ 4-2-9-0.
తాజావార్తలు
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారనున్న అనుష్క..!