బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 16:59:27

పాక్‌ను కుప్పకూల్చిన కుర్రాళ్లు..భారత్‌ టార్గెట్‌ 173

పాక్‌ను కుప్పకూల్చిన కుర్రాళ్లు..భారత్‌ టార్గెట్‌ 173

మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 43.1 ఓవర్లలో 172 పరుగులే చేసి ఆలౌటైంది.

పోచెఫ్‌స్ట్రూమ్‌(దక్షిణాఫ్రికా): అండర్‌-19  ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌ పోరులో  భారత బౌలర్లు మరోసారి ఆకట్టుకున్నారు. పాకిస్థాన్‌తో కీలక పోరులో బౌలర్లు  అద్భుత ప్రదర్శన చేసి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 43.1 ఓవర్లలో 172 పరుగులే చేసి ఆలౌటైంది.  ఓపెనర్‌ హైదర్‌ అలీ(56: 77 బంతుల్లో 9ఫోర్లు), నజీర్‌(62: 102 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో పాక్‌ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లు సుశాంత్‌ మిశ్రా(3/28), కార్తీక్‌ త్యాగీ(2/32), రవి బిష్ణోయ్‌(2/46) కళ్లుచెదిరే బౌలింగ్‌తో  పాక్‌ను కుప్పకూల్చారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్‌, ఫీల్డింగ్‌ హైలెట్‌గా నిలిచింది.  


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ ఆరంభం నుంచి తడబడింది. తొలి ఓవర్‌ నుంచే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయలేకపోయారు. రెండో ఓవర్‌లోనే సుశాంత్‌ మిశ్రా పాక్‌కు పెద్ద షాకిచ్చాడు. ఓపెనర్‌ మహ్మద్‌ హురైరా(4)ను ఔట్‌ చేసి భారత్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అనంతరం 34 పరుగుల వద్ద మునీర్‌(4) వికెట్‌ కోల్పోయింది. 34 పరుగులకే రెండు ప్రధాన వికెట్లు చేజార్చుకోవడంతో పాక్‌పై ఒత్తిడి పెరిగింది.

ఈ దశలో మరో ఓపెనర్‌ హైదర్‌ అలీ, నజీర్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. భారీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న జోడీని యశస్వి జైశ్వాల్‌ విడగొట్టాడు. తన తొలి ఓవర్లోనే హైదర్‌ను ఔట్‌ చేసి స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశాడు. ఆ తర్వాత ఏ దశలోనూ పాక్‌ ఇన్నింగ్స్‌ గాడిన పడలేదు. నజీర్‌ ఆఖరి వరకు పోరాడినా గౌరవప్రదమైన స్కోరు చేయలేకపోయింది. టెయిలెండర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. logo