శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 29, 2020 , 00:42:58

బెంగళూరుపై ముంబై విజయం

బెంగళూరుపై ముంబై విజయం

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ సత్తాచాటింది. అదిరే ఆటతీరుతో సత్తాచాటి ప్లేఆఫ్స్‌కు దాదాపు అర్హత సాధించింది. 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం  బంతితో బుమ్రా... బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ విజృంభణతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అద్భుత విజయాన్నందుకుంది. సీజన్‌ ఆరంభంలో సూపర్‌ ఓవర్లో ఎదురైన ఓటమికి ముంబై కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. 

అబుదాబి: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌ ఈ ఏడాది ఎనిమిదో విజయంతో ప్లేఆఫ్స్‌ను సమీపించింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ను పటిష్టం చేసుకుంది.  టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌(45 బంతుల్లో 74; 12ఫోర్లు, ఓ సిక్స్‌) రాణించినా ముంబై బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా(3/14) ధాటికి మిగిలిన బ్యాట్స్‌మన్‌ విఫలమయ్యారు. సూర్య కుమార్‌ యాదవ్‌(43 బంతుల్లో 79 నాటౌట్‌; 10ఫోర్లు, 3సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్‌ సిరాజ్‌, చాహల్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సూర్య కుమార్‌కు దక్కింది.  

సూర్య ప్రతాపం

అసలే సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్య కుమార్‌ యాదవ్‌.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమ్‌ఇండియాలో చోటు దక్కలేదన్న కసితో బాదేయడంతో ముంబై సాధికారిక విజయం సాధించింది.  లక్ష్యఛేదనలో ముంబై ఓపెనర్లు డికాక్‌(18), ఇషాన్‌ కిషన్‌(25) నెమ్మదైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ తరుణంలో హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌.. డికాక్‌ను పెవిలియన్‌కు పంపాడు. కాసేపటికే ఇషాన్‌ కిషన్‌ సైతం ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్య కుమార్‌ బౌండరీలతో దూకుడు పెంచడంతో ముంబై 10 ఓవర్లకు 70 పరుగుల మార్క్‌ను చేరింది. సౌరభ్‌ తివారీ(5) ఔటైనా సూర్య ఏ మాత్రం తగ్గలేదు. చాహల్‌ ఓవర్‌లో సిక్స్‌ కొట్టిన యాదవ్‌.. ఆ తర్వాత స్టెయిన్‌ వేసిన 13వ ఓవర్లో మూడు ఫోర్లతో లక్ష్యాన్ని కరిగించాడు. ఏ మాత్రం జంకు లేకుండా బౌండరీలతో విరుచుకుపడ్డాడు.  చివరి ఐదు ఓవర్లకు 48 పరుగులు చేయాల్సిన దశలో సిరాజ్‌ వేసిన 16వ ఓవర్లోనూ మూడు ఫోర్లతో సూర్య మ్యాజిక్‌ చేశాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్య(17) ఔటైనా దూకుడు తగ్గించని యాదవ్‌ అజేయంగా జట్టును విజయతీరం దాటించాడు. 

పడిక్కల్‌ ఒక్కడే..  

 ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఫించ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మరో ఓపెనర్‌ జోష్‌ ఫిలిప్‌(33) ఆరంభంలో కాసేపు రాణించాడు. పడిక్కల్‌, ఫిలిప్‌ బౌండరీలతో ముంబై బౌలర్లపై విరుచుకుపడడంతో ఆర్‌సీబీ పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. ఫిలిప్‌ ఔటైనా పడిక్కల్‌ జోరు కొనసాగించాడు. ఇక స్లోగా ఆడిన కెప్టెన్‌ కోహ్లీ(9).. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత డివిలియర్స్‌(15), దూబే(2), మోరిస్‌(4) విఫలమవడంతో చాలెంజర్స్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. పడిక్కల్‌ మాత్రం 30 బంతుల్లో అర్ధశతకం తర్వాత  కాసేపు ధాటిగా ఆడి ఔటయ్యాడు. చివర్లో గుర్‌కీరత్‌(14నాటౌట్‌), సుందర్‌ (10నాటౌట్‌ ) కొన్ని పరుగులు జోడించారు. ఈ క్రమంలో  17వ ఓవర్‌ను   బుమ్రా డబుల్‌ వికెట్‌ మెయిడిన్‌గా ముగించాడు. దీంతో చివరి ఐదు ఓవర్లలో ఆర్‌సీబీ 35 పరుగులే చేయగలిగింది. 

బుమ్రాకు మొదటిది.. వందోది కోహ్లీనే

ముంబై ఇండియన్స్‌ స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్కును దాటాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లీని ఔట్‌ చేసి ఈ మైలురాయిని చేరాడు. 2013 ఐపీఎల్‌ తన అరంగేట్ర మ్యాచ్‌లో తొలి వికెట్‌గా విరాట్‌ను ఔట్‌ చేసిన బుమ్రా.. ఏడేండ్ల తర్వాత వందో వికెట్‌ ఫీట్‌ను సైతం అతడిని ఔట్‌ చేయడం ద్వారానే చేరుకోవడం విశేషం.

స్కోరు బోర్డు

బెంగళూరు: ఫిలిప్‌ (స్టంప్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 33, పడిక్కల్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 74, కోహ్లీ (సి) తివారి (బి) బుమ్రా 9, డివిలియర్స్‌ (సి) చాహర్‌ (బి) పొలార్డ్‌ 15, దూబే (సి) సూర్య కుమార్‌ (బి) బుమ్రా 2, మోరిస్‌ (సి) ప్యాటిన్‌సన్‌ (బి) బౌల్ట్‌ 4, గుర్‌కీరత్‌ (నాటౌట్‌) 14, సుందర్‌ (నాటౌట్‌) 10. ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 164/4. వికెట్ల పతనం: 1-71, 2-95, 3-131, 4-134, 5-134, 6-138. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-40-1, బుమ్రా 4-1-14-3, కృనాల్‌ 4-0-27-0, ప్యాటిన్‌సన్‌ 3-0-35-0, చాహర్‌ 4-0-43-1, పొలార్డ్‌ 1-0-5-1. 

ముంబై: డికాక్‌ (సి) గుర్‌కీతర్‌ (సి) సిరాజ్‌ 18, ఇషాన్‌ (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 25, సూర్య కుమార్‌ (నాటౌట్‌) 79 , తివారి (సి) పడిక్కల్‌ (బి) సిరాజ్‌ 5, కృనాల్‌ (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 10, హార్దిక్‌ (సి) సిరాజ్‌ (సి) మోరిస్‌ 17, పొలార్డ్‌ (నాటౌట్‌) 4. ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 19.1 ఓవర్లలో 166/5. వికెట్ల పతనం: 37-1, 52-2, 3-72, 4-107, 5-158. బౌలింగ్‌: మోరిస్‌ 4-0-36-1, స్టెయిన్‌ 4-0-43-0, సుందర్‌ 4-0-20-0, సిరాజ్‌ 3.1-0-28-2, చాహల్‌ 4-0-37-2.