సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 18, 2020 , 00:07:48

ఇద్దరం ఏడ్చేశాం..

ఇద్దరం ఏడ్చేశాం..

 న్యూఢిల్లీ:  టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ, సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఈ నెల15న అంతర్జాతీయ క్రికెట్‌కు నిమిషాల వ్యవధిలో వీడ్కోలు పలికి క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు. ఇప్పటికీ ఆ విషయం గురించే చర్చంతా నడుస్తున్నది. రెండు ప్రపంచకప్‌లతో పాటు భారత్‌కు అపూర్వ విజయాలను అందించిన ధోనీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌ ప్రకటించిన శనివారం ఏం జరిగింది?, ఒకే రోజు ఇద్దరు ఎందుకు వీడ్కోలు పలికారు? అన్న విషయాలను సురేశ్‌ రైనా సోమవా రం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కన్నీళ్లు, ఆలింగనాలు, పార్టీతో ఆ రోజు గడిచిపోయిందని తెలిపాడు.  ‘చెన్నై వచ్చాక ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని నాకు తెలుసు. అందుకే నేను కూడా సిద్ధంగానే ఉన్నా. నేను, పియూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, కరణ్‌ శర్మ ఆగస్టు 14నే ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లాం. మహీ భాయ్‌ను పికప్‌ చేసుకున్నాం. రిటైర్మెంట్‌ ప్రకటించాక మేమిద్దరం భావోద్వేగానికి లోనయ్యాం. కౌగిలించుకొని చాలా ఏడ్చేశాం. ఆ తర్వాత పియూష్‌, అంబటి రాయుడు, కేదార్‌, కరణ్‌తో కలిసి మా కెరీర్లు, అనుబంధాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఆ రాత్రి పార్టీ చేసుకున్నాం’ అని రైనా వెల్లడించాడు. వచ్చే నెల 19న యూఏఈలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు.. చెన్నైలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో ఉన్న సంగతి తెలిసిందే.  

అందుకే ఆగస్టు 15న.. 

  స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని ధోనీతో పాటు తాను ముందే అనుకున్నట్టు రైనా వెల్లడించారు. అందుకు కారణాన్ని చెప్పాడు. ‘ధోనీ జెర్సీ నంబర్‌ 7, నాది 3. రెండింటిని జత చేస్తే 73. ఈ ఏడాది ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73ఏండ్లు పూర్తయ్యాయి. అంతకంటే మంచి రోజు ఇంకేముంటుంది’ అని రైనా అన్నాడు. 

ధోనీతో పనిచేయడం గర్వంగా ఉంది: కిర్‌స్టెన్‌ 

భారత మాజీ కెప్టెన్‌ ధోనీతో కలిసి పని చేయడం గర్వంగా ఉందని మాజీ చీఫ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ అన్నాడు. 16 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ ధోనీ తాజాగా రిటైర్మెంట్‌ పలికిన నేపథ్యంలో కిర్‌స్టెన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. మహీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌తో కలిసి పనిచేయడం చాలా గర్వంగా ఉంది. భారత క్రికెట్‌ జట్టుతో ఎన్నో మధుర జ్ఞాపకాలకు కారణమైన ధోనీకి కృతజ్ఞతలు’ అని అన్నాడు.

చికాగో చాచా కూడా వీడ్కోలు..

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలకడంతో.. ఇకపై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగబోయే మ్యాచ్‌లకు హాజరుకానని సూపర్‌ ఫ్యాన్‌ ‘చికాగో చాచా’ బషీర్‌ చెప్పాడు. కరాచీ వాస్తవ్యుడైన మహమ్మద్‌ బషీర్‌ బొజాయ్‌.. మహీకి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నమెంట్లలో భాగంగా దాయాదుల మధ్య జరిగే మ్యాచ్‌లకు తప్పకుండా హజరయ్యే చికాగో చాచా ఇకపై తాను మ్యాచ్‌లకు రాబోనని ప్రకటించాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రాంచీకి వెళ్లి ధోనీని కలిసి శుభాకాంక్షలు తెలుపుతాను అని అన్నాడు. 


logo