మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 28, 2020 , 01:28:41

ఢిల్లీకి సన్‌స్ట్రోక్‌

ఢిల్లీకి సన్‌స్ట్రోక్‌

హైదరాబాద్‌ భారీ విజయం.. మెరిసిన సాహా, వార్నర్‌, రషీద్‌ కొత్త ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా, బర్త్‌డే బాయ్‌ డేవిడ్‌ వార్నర్‌ విరుచుకుపడటంతో.. లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రబాడకు బంతి ఇవ్వాలంటేనే ఢిల్లీ కెప్టెన్‌ భయపడిపోయాడు. బంతి పిచ్‌పై పడటమే  ఆలస్యం దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నట్లు చెలరేగిపోయిన ఓపెనర్లు.. ఈ సీజన్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోరును నమోదు చేస్తే.. ఐపీఎల్‌ చరిత్రలోనే రబాడ రెండో చెత్త స్పెల్‌ తన పేరిట రాసుకున్నాడు. అన్నీ గెలిచినా ముందుకు వెళ్లడం అసాధ్యమే అయిన సమయంలో సన్‌రైజర్స్‌ అదరగొడితే.. లీగ్‌ ఆరంభంలో అద్భుతాలు చేసిన ఢిల్లీ  పరాజయాల హ్యాట్రిక్‌ మూటగట్టుకుంది. 

దుబాయ్‌: ఆశలు అడుగంటిన వేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదిరిపోయే విజయంతో ఆకట్టుకుంది. మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిచినా.. ఇతర జట్ల గెలుపోటములపై సమీకరణాలు ఆధారపడి ఉన్న తరుణంలో సమిష్టిగా సత్తాచాటింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 88 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వార్నర్‌ సేన 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (34 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరలెవల్లో విజృంభించగా.. మనీశ్‌ పాండే (31 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్సర్‌) అజేయంగా నిలిచాడు. గత 25 ఐపీఎల్‌ మ్యాచ్‌ల నుంచి ప్రతీ పోరులో కనీసం ఒక వికెట్‌ అయినా పడగొట్టిన రబాడ (0/54) ఈసారి రిక్తహస్తాలతో వెనుదిరిగాడు. అనంతరం లక్ష్యఛేదనలో రషీద్‌ ఖాన్‌ (3/7) ధాటికి ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌ (36) టాప్‌ స్కోరర్‌. సాహాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. 

దంచుడే దంచుడు..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. బెయిర్‌స్టో బదులు ఓపెనర్‌గా బరిలో దిగిన సాహా.. బర్త్‌డే బాయ్‌ వార్నర్‌తో కలిసి సాహో అనిపించాడు. ఈ జోడీ బాదుడుకు ఢిల్లీ బౌలర్లు తల్లడిల్లిపోయారు. రెండో ఓవర్‌లో సాహా రెండు ఫోర్లు బాదితే.. మూడో ఓవర్‌లో వార్నర్‌ సిక్సర్‌ అందుకున్నాడు. నోర్జే వేసిన నాలుగో ఓవర్‌లో వార్నర్‌ రెండు ఫోర్లు బాదడంతో రన్‌రేట్‌ రాకెట్‌ను తలపించింది. ఇక రబాడ వేసిన ఆరో ఓవర్‌లో అయితే వార్నర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 4,4,6,4,4తో 22 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికే హైదరాబాద్‌ 77/0తో పటిష్ట స్థితిలో నిలువగా.. వార్నర్‌ 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించాక ఎట్టకేలకు పదో ఓవర్‌లో అశ్విన్‌ ఈ జోడీని విడదీశాడు. వార్నర్‌ ఔటయ్యాక రన్‌రేట్‌ తగ్గుతుందేమో అనుకుంటే.. అతడు ఔటైన తర్వాత నాలుగు బంతుల్లో మూడు బౌండ్రీలు బాదిన సాహా 27 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్‌ దాటాడు. మరో ఎండ్‌లో పాండే నుంచి సహకారం లభించడంతో సాహా వరుస బౌండ్రీలతో రెచ్చిపోయాడు. అక్షర్‌ ఓవర్‌లో 6,4 బాదిన సాహా.. రబాడ వేసిన షార్ట్‌బాల్‌ను మిడ్‌వికెట్‌పై నుంచి సిక్సర్‌గా మలిచాడు. దీంతో 14 ఓవర్లలోనే హైదరాబాద్‌ 165 పరుగులకు చేరింది. సెంచరీ చేసేలా కనిపించిన సాహాను నోర్జే పెవిలియన్‌ పంపాడు. ఆఖర్లో పాండే కొన్ని విలువైన పరుగులు చేసినా.. విలియమ్సన్‌ (11 నాటౌట్‌) భారీ షాట్లు కొట్టలేకపోయాడు.

ఒకరి వెంట ఒకరు..

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. ధావన్‌ (0), స్టొయినిస్‌ (5), హెట్‌మైర్‌ (16), రహానే (26), అయ్యర్‌ (7), అక్షర్‌ (1) ఘోరంగా విఫలమై పెవిలియన్‌కు క్యూ కట్టారు. బంతి బంతికి వికెట్‌ తేసేలా కనిపించిన రషీద్‌ ఖాన్‌ 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

స్కోరు బోర్డు

హైదరాబాద్‌: వార్నర్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 66, సాహా (సి) అయ్యర్‌ (బి) నోర్జే 87, పాండే (నాటౌట్‌) 44, విలియమ్సన్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 219/2. వికెట్ల పతనం: 1-107, 2-170, బౌలింగ్‌: నోర్జే 4-0-37-1, రబాడ 4-0-54-0, అశ్విన్‌ 3-0-35-1, అక్షర్‌ 4-0-36-0, దేశ్‌పాండే 3-0-35-0, స్టొయినిస్‌ 2-0-15-0.

ఢిల్లీ: రహానే (ఎల్బీ) రషీద్‌ 26, ధావన్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 0, స్టొయినిస్‌ (సి) వార్నర్‌ (బి) నదీమ్‌ 5, హెట్‌మైర్‌ (బి) రషీద్‌ 16, పంత్‌ (సి) (సబ్‌) గోస్వామి (బి) సందీప్‌ 36, అయ్యర్‌ (సి) విలియమ్సన్‌ (బి) శంకర్‌ 7, అక్షర్‌ (సి) (సబ్‌) ప్రియమ్‌ (బి) రషీద్‌ 1, రబాడ (బి) నటరాజన్‌ 3, అశ్విన్‌ (సి) సమద్‌ (బి) హోల్డర్‌ 7, దేశ్‌పాండే (నాటౌట్‌) 20, నోర్జే (సి) (సబ్‌) ప్రియమ్‌ (బి) నటరాజన్‌ 1, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 19 ఓవర్లలో 131. వికెట్ల పతనం: 1-1, 2-14, 3-54, 4-55, 5-78, 6-83, 7-103, 8-103, 9-125, 10-131, బౌలింగ్‌: సందీప్‌ 4-0-27-2, నదీమ్‌ 1-0-8-1, హోల్డర్‌ 4-0-46-1, రషీద్‌ 4-0-7-3, నటరాజన్‌ 4-0-26-2, శంకర్‌ 1.5-0-11-1, వార్నర్‌ 0.1-0-2-0.