బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Sep 29, 2020 , 23:27:57

IPL 2020: హమ్మయ్య... సన్‌రైజర్స్‌ బోణీ

IPL 2020: హమ్మయ్య... సన్‌రైజర్స్‌ బోణీ

అబుదాబి: ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది.  వరుసగా రెండు మ్యాచ్‌ల్లో  ఓటమి తర్వాత మూడో మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌   గెలుపొందింది.  మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల  తేడాతో డేవిడ్‌ వార్నర్‌సేన ఘన విజయం సాధించింది.  163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది.  ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(34:31 బంతుల్లో 4ఫోర్లు) టాప్‌ స్కోరర్‌.  హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా ఎక్కువసేపు  నిలువలేకపోయారు.  కీలక సమయాల్లో వికెట్లు తీసిన రషీద్‌ ఖాన్‌(3/14, భువనేశ్వర్‌ కుమార్‌(2/25) సన్‌రైజర్స్‌కు విజయాన్నందించారు. 

హైదరాబాద్‌ నిర్దేశించిన 163  పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన ఢిల్లీకి  ఆదిలోనే  ఎదురుదెబ్బ  తగిలింది. భువనేశ్వర్‌ కుమార్‌  వేసిన  తొలి ఓవర్‌లోనే    ఓపెనర్‌ పృథ్వీ షా(2) వికెట్‌  కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌(17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే  ప్రయత్నం చేశాడు. స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ ఔటవడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. 

ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్‌.. ధావన్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు.  12వ ఓవర్లో రషీద్‌..ధావన్‌ను పెవిలియన్‌ పంపి మ్యాచ్‌ను హైదరాబాద్‌ వైపు తిప్పాడు.  ఈ సమయంలో క్రీజులో ఉన్న పంత్‌, హెట్‌మైయర్‌ జోడీ ప్రమాదకరంగా కనిపించింది.  స్పిన్నర్ల బౌలింగ్‌లో నిదానంగా ఆడిన ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ పేసర్ల బౌలింగ్‌లో దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది.  సిక్సర్లతో విరుచుకుపడుతున్న హెట్‌మైయర్‌(21)ను భువీ పెవిలియన్‌  పంపగా ..  పంత్‌(28)ను రషీద్‌ ఔట్‌ చేశాడు. ఇక 18వ ఓవర్లో డేంజరస్‌ బ్యాట్స్‌మన్‌ స్టాయినీస్‌(11)ను నటరాజన్‌ ఎల్బీడబ్లూగా వెనక్కి పంపడంతో హైదరాబాద్‌ విజయం ఖాయమైంది. 

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో  4 వికెట్లకు 162 పరుగులు చేసింది. జానీ బెయిర్‌ స్టో(53: 48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌),  డేవిడ్‌ వార్నర్‌(45 :33 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు),  కేన్‌ విలియమ్సన్‌(41:  26 బంతుల్లో 5ఫోర్లు) రాణించారు.  సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన విలియమ్సన్‌ మెరుపు  ఇన్నింగ్స్‌తో చెలరేగి  సన్‌రైజర్స్‌కు  పోరాడే స్కోరు అందించాడు.   ఢిల్లీ బౌలర్లలో అమిత్‌ మిశ్రా, రబాడ చెరో రెండు వికెట్లు తీశారు.