మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 04, 2020 , 00:47:27

హైదరాబాద్‌ ఐదోసారి

హైదరాబాద్‌ ఐదోసారి

ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్‌..  చివరి మ్యాచ్‌లో ముంబైపై ఘన విజయం కోల్‌కతా ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. పవర్‌ఫుల్‌ విక్టరీతో సన్‌రైజర్స్‌ ఫ్లే ఆఫ్స్‌కు చేరింది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ముంబైని తక్కువ పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్‌.. బుమ్రా, బౌల్ట్‌ లేని బౌలింగ్‌ దళాన్ని చెడుగుడాడుకుంది. వార్నర్‌, సాహా అజేయ   అర్ధసెంచరీలతో లీగ్‌ దశకు ముగింపు పలికిన రైజర్స్‌ శుక్రవారం ఎలిమినేటర్‌లో బెంగళూరుతో తలపడనుంది. 

షార్జా: 2016 ఐపీఎల్‌ను తలపించేలా.. లీగ్‌ దశలో తప్పక నెగ్గాల్సిన చివరి మూడు మ్యాచ్‌ల్లో సత్తాచాటిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా ఐదోసారి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (36), ఇషాన్‌ కిషన్‌ (33) ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో పొలార్డ్‌ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) వేగంగా ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ 3, హోల్డర్‌, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' నదీమ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 85 నాటౌట్‌; 10 ఫోర్లు, ఒక సిక్సర్‌), వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) దంచికొట్టడంతో సన్‌రైజర్స్‌ 17.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 151 పరుగులు చేసింది.

సూపర్‌ ఓపెనింగ్‌: లక్ష్యఛేదనలో ఓపెనర్లు రెచ్చిపోవడంతో హైదరాబాద్‌కు మంచి ఆరంభం దక్కింది. రెండో ఓవర్‌లో 6,4 కొట్టిన సాహా.. మరుసటి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదితే.. నాలుగో ఓవర్‌లో వార్నర్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు అరుసుకున్నాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. బుమ్రా, బౌల్ట్‌ గైర్హాజరీలో ముంబై బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న రైజర్స్‌ ఓపెనర్లు.. గ్రౌండ్‌ నలువైపులా బౌండ్రీలు బాదుతూ  అజేయ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు.

నదీమ్‌ డబుల్‌ స్ట్రోక్‌: టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌ల తర్వాత తిరిగి బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ (4)మూడో ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన డికాక్‌ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా వెనుదిరగడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబై 48/2తో నిలిచింది. అడపాదడపా బౌండ్రీలు కొట్టిన సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌ మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ దశలో నదీమ్‌ ఒకే ఓవర్‌లో సూర్యకుమార్‌, కృనాల్‌ పాండ్యా (0)ను వెనక్కి పంపగా.. మరుసటి ఓవర్‌లో సౌరభ్‌ తివారి (1) కూడా ఔటైయ్యాడు. అయినా ఆఖర్లో పొలార్డ్‌ సిక్సర్లతో రెచ్చిపోవడంతో ముంబై మంచి స్కోరు చేయగలిగింది.

అచ్చం అలాగే..

2016 సీజన్‌లో కూడా సన్‌రైజర్స్‌ చివరి మూడు మ్యాచ్‌లు తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో సత్తాచాటి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అచ్చం అదే రీతిలో ఈ సారి కూడా చివరి మూడు మ్యాచ్‌లు నెగ్గి ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్‌ మళ్లీ టైటిల్‌ సాధిస్తుందా చూడాలి!

స్కోరు బోర్డు

ముంబై: రోహిత్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 4, డికాక్‌ (బి) సందీప్‌ 25, సూర్యకుమార్‌ (సి) సాహా (బి) నదీమ్‌ 36, ఇషాన్‌ (బి) సందీప్‌ 33, కృనాల్‌ (సి) విలియమ్సన్‌ (బి) నదీమ్‌ 0, తివారి (సి) సాహా (బి) రషీద్‌ 1, పొలార్డ్‌ (బి) హోల్డర్‌ 41, కూల్టర్‌నైట్‌ (సి) గార్గ్‌ (బి) హోల్డర్‌ 1, ప్యాటిన్‌సన్‌ (నాటౌట్‌) 4, కులకర్ణి (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 20 ఓవర్లలో 149/8. వికెట్ల పతనం: 1-12, 2-39, 3-81, 4-81, 5-82, 6-115, 7-116, 8-145, బౌలింగ్‌: సందీప్‌ 4-0-34-3, హోల్డర్‌ 4-0-25-2, నదీమ్‌ 4-0-19-2, నటరాజన్‌ 4-0-38-0, రషీద్‌ 4-0-32-1.

హైదరాబాద్‌: వార్నర్‌ (నాటౌట్‌) 85, సాహా (నాటౌట్‌) 58, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 17.1 ఓవర్లలో 151/0. బౌలింగ్‌: కులకర్ణి 3-0-22-0, కూల్టర్‌నైల్‌ 4-0-27-0, ప్యాటిన్‌సన్‌ 3-0-29-0, చాహర్‌ 4-0-36-0, కృనాల్‌ 3.1-0-37-0.