గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Feb 19, 2020 , 00:04:56

సునీల్‌కు స్వర్ణం

 సునీల్‌కు స్వర్ణం
  • ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ సునీల్‌ కుమార్‌ దుమ్మురేపాడు. గ్రీకో రోమన్‌ విభాగంలో 27 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ మనదేశం తరఫున తొలి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన 87 కేజీల ఫైనల్లో సునీల్‌ 5-0తో అజత్‌ సాలిదినోవ్‌ (కిర్గిస్థాన్‌)పై విజయం సాధించాడు.  గత చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న సునీల్‌.. ఈసారి ‘పట్టు’ వదల్లేదు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించి పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు సెమీస్‌లో సునీల్‌ 12-8తో అజ్మత్‌  (కజకిస్థాన్‌)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. మరో భారత బాక్సర్‌ అర్జున్‌ హలక్కురి (55 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. సెమీస్‌లో 7-8తో  నాసెర్‌పౌర్‌ (ఇరాన్‌) చేతిలో ఓడిన అర్జున్‌.. అనంతరం జరిగిన కాంస్య పోరులో కొరియాకు చెందిన డాంగియోక్‌పై నెగ్గాడు. ఇతర విభాగాల్లో సచిన్‌ రాణా 0-8తో ఎల్‌మురాత్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో.. సజన్‌ 6-9తో రేనత్‌ ఇలియాజులు (కిర్గిస్థాన్‌) చేతిలో ఓడారు. భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం లేకున్నా.. పోటీలు జరుగుతున్న కేడీ జాదవ్‌ ఇండోర్‌ స్టేడియంలో జపాన్‌, కొరియా, చైనీస్‌ తైపీకి చెందిన కొందరు రెజ్లర్లు ముఖాలకు మాస్క్‌లు ధరించారు. 


logo