అవుట్ ఇచ్చినందుకు కాదు.. ఆస్ట్రేలియన్లు రెచ్చగొట్టినందుకే అలా చేశా!

మెల్బోర్న్: క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. చాలా పద్ధతిగా వివాదాలకు దూరంగా ఎంతో హుందాగా ఈ గేమ్ ఆడుతారని ఆ పేరు వచ్చింది. అయితే అలాంటి పెద్ద మనుషుల క్రీడలోనూ చాలా వివాదాలే చోటు చేసుకున్నాయి. అలాంటిదే ఒకటి 1981లో జరిగింది. అప్పట్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సునీల్ గవాస్కర్.. అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల వెనుదిరగాల్సి వచ్చింది. అయితే తాను వెళ్తూ వెళ్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న చేతన్ చౌహాన్‌ను కూడా సన్నీ తీసుకొని వెళ్లడం వివాదానికి కారణమైంది. మ్యాచ్ నుంచి వాక్ ఆఫ్ చేస్తున్నట్లు గవాస్కర్ చెప్పడం సంచలనం సృష్టించింది. అయితే ఆ వివాదానికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగిందో ఇన్నాళ్లకు లిటిల్ మాస్టర్ వెల్లడించాడు.
గెట్ లాస్ట్ అన్నారు..
డెన్నిస్ లిల్లీ బౌలింగ్‌లో గవాస్కర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలిందంటూ సన్నీ చెప్పినా.. అంపైర్ నిర్ణయం మారలేదు. దీంతో అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ ఫీల్డర్‌కు కూడా ఇన్సైడ్ ఎడ్జ్ అయిందని తెలుసు. అయినా అతడు ఏమీ మాట్లాడలేదు. డెన్నిస్ మాత్ర అది ప్యాడ్‌కే తగిలిందని వాదించాడు. కాదు బ్యాట్‌కు తగిలిందని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా వినలేదు అని గవాస్కర్ చెప్పాడు. ఆ వెంటనే చేతన్ చౌహాన్‌ను తీసుకొని బయటకు వెళ్లిపోవడానికి సన్నీ ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు. అంపైర్ తప్పుడు నిర్ణయంపై తనకు అసంతృఫ్తి ఉన్నా.. తాను వాక్ ఆఫ్ చేయడానికి కారణం అది కాదని గవాస్కర్ చెప్పాడు. తాను వెళ్లే సమయంలో ఆస్ట్రేలియన్లు గెట్ లాస్ట్ అని అన్నారని, దాంతో వెనక్కి తిరిగి వచ్చి చేతన్‌ను కూడా తీసుకెళ్లానని తెలిపాడు. అయితే చౌహాన్ కూడా వెనుకా ముందూ అవుతూ సన్నీతో కలిసి వెళ్లడం, ఆ తర్వాత అప్పటి మేనేజర్ షాహిద్ దురానీ కలుగజేసుకొని వివాదం సద్దుమణిగేలా చేయడంతో మ్యాచ్ కొనసాగింది.
Did you know Sunil Gavaskar has the match ball from the 1983 World Cup final?
— 7Cricket (@7Cricket) December 28, 2020
The 'original little master' joins @bowlologist for a career retrospective ???? pic.twitter.com/jYee97Hq4m
వాక్ ఆఫ్ ఎందుకు?
తాను వాక్ ఆఫ్ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాన్ని కూడా ఈ సందర్భంగా గవాస్కర్ వివరించాడు. అంతకుముందు రోజు అలన్ బోర్డర్ మూడుసార్లు అవుటైనా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడని, దీంతో వికెట్ కీపర్ సయ్యాద్ కిర్మాణీ తాను వాక్ ఆఫ్ చేస్తానని చెప్పినట్లు గవాస్కర్ వెల్లడించాడు. అలా చేయడం సరి కాదని తాను అప్పుడు అడ్డుకున్నా.. తర్వాతి రోజే ఆస్ట్రేలియన్లు రెచ్చగొట్టడం వల్ల తానే వాక్ ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ కొనసాగడం ఇండియాకు కలిసి వచ్చింది. ఆ మ్యాచ్‌లో 59 పరుగులతో ఇండియా గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో కపిల్‌దేవ్ 5 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కేవలం 83 పరుగులకే కుప్పకూలింది.