సుందర శార్దూల్

- అర్ధశతకాలతో అదరగొట్టిన వాషింగ్టన్, ఠాకూర్
- భారత్ తొలి ఇన్నింగ్స్ 336
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 21/0
ఆసీస్ పేస్ త్రయం నిప్పులు చెరుగుతుండటంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. నమ్మకం పెట్టుకున్న పుజారా, రహానే నిరాశ పర్చగా.. మిడిలార్డర్లో మయాంక్, పంత్ ఎక్కువసేపు నిలువలేకపోయారు. అంతకుముందే రోహిత్, గిల్ పెవిలియన్ చేరిపోవడంతో.. ఇంకేముంది మరికాసేపట్లో భారత్ ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకున్నారంతా!
కానీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అద్వితీయ పోరాటం చేశారు. అందులో ఒకరికి ఇదే అరంగేట్ర మ్యాచ్ కాగా.. మరొకరికి కేవలం రెండో టెస్టే. అయినా అదరక బెదరక కంగారూలకు ఎదురు నిలిచారు. ఆసీస్‌ను అనామక జట్టుగా మారుస్తూ.. నాణ్యమైన పేస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ గబ్బాలో బౌండరీల మోత మోగించారు.
150 పరుగుల ఆధిక్యం ఖాయం అనుకున్న కంగారూలను వారి సొంతగడ్డపైనే చెడుగుడాడుకున్న ఈ జోడీ.. ఆధిక్యాన్ని 33 పరుగులకు తగ్గించింది. తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం మెల్బోర్న్లో పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిన టీమ్ఇండియా.. సిడ్నీలో తమ దమ్ము ఏంటో ప్రత్యర్థికి చూపితే.. బ్రిస్బేన్‌లో బెంచ్ పవర్ చాటింది. మిగిలిన రెండు రోజులు వర్షం పడే సూచనలు ఉండటంతో.. మ్యాచ్ ఫలితం ఎటు వైపు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది!
బ్రిస్బేన్: ఆహా ఏమా పోరాటం.. టాపార్డర్ తడబడ్డ చోట భారత లోయర్ ఆర్డర్ చెలరేగిపోయింది. అనుభవం లేకపోతేనేమి అదరగొట్టే సత్తా తమలో ఉందని నిరూపించింది. అరంగేట్ర ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, ఒక సిక్సర్), శార్దూల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌సెంచరీలు బాదడంతో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 336 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హజిల్‌వుడ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలు ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేశారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆసీస్ ఓవరాల్‌గా 54 పరుగుల ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వార్నర్ (20), హరీస్ (1) క్రీజులో ఉన్నారు. మరి నాలుగో రోజు మొత్తం పైన్ సేన బ్యాటింగ్ చేస్తుందా లేక ధనాధన్ ఆడి టీమ్ఇండియాకు టార్గెట్ ఇస్తుందా చూడాలి!
టాప్ నిరాశపరిచినా..
ఓవర్‌నైట్ స్కోరు 62/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆరంభంలో ఫర్వాలేదనిపించింది. అయితే మనవాళ్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచ లేకపోయారు. తొలి సెషన్లో కొన్ని చక్కటి షాట్లు ఆడిన పుజార (25), రహానే (37) నిలదొక్కుకున్నాక వికెట్లు పారేసుకున్నారు. ఓపెనర్‌గా విఫలమై మిడిలార్డర్లో చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ (38), గత మ్యాచ్‌లో దూకుడైన ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ (23) కూడా కెప్టెన్‌ను అనుసరించడంతో భారత జట్టు 186 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది.
123 పరుగుల భాగస్వామ్యం
ప్రధాన బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు రాబట్టలేకపోయిన చోట సుందర్, శార్దూల్ ఆకట్టుకున్నారు. సుందర్ కాస్త ఆచితూచి ఆడినా.. శార్దూల్ మాత్రం కంగారూలపై పగబట్టినవాడిలా విరుచుకుపడ్డాడు. కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఖాతా తెరిచిన అతడు.. అదే ఓవర్లో మరో ఫోర్‌తో కలిసి 12 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో సుందర్ కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో లియాన్ బంతిని క్రీజు వదిలి ముందుకొచ్చి సిక్సర్ బాదిన శార్దూల్ టెస్టుల్లో తొలి అర్ధశతకం పూర్తి చేసుకోగా.. కాసేపటికే సుందర్ ఫిఫ్టీ మార్క్‌ను చేరాడు. ఏడో వికెట్‌కు రికార్డు స్థాయి భాగస్వామ్యం నమోదు చేశాక శార్దూల్ ఔటయ్యాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. చివర్లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ (13) కొన్ని విలువైన పరుగులు జోడించాడు.
గెలుపు ముంగిట..
గాలే: అన్ని విభాగాల్లో అదరగొట్టిన ఇంగ్లండ్.. ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో విజయం ముంగిట నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక 359 పరుగులకు ఆలౌటై ఇంగ్లీష్ జట్టు ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 38 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన రూట్ సేన.. విజయానికి ఇంకా 36 రన్స్ దూరంలో ఉంది. బెయిర్‌స్టో (11), డాన్ లారెన్స్ (7) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు లహిరు తిరిమన్నె (111), ఏంజెలో మాథ్యూస్ (71) రాణించడంతో లంక రెండో ఇన్నింగ్స్‌లో 359 పరుగులు చేయగలిగింది. జాక్ లీచ్‌కు ఐదు వికెట్లు దక్కాయి.
అచ్చం అలాగే..
భారత్, ఆస్ట్రేలియా మధ్య 2003లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ కూడా అచ్చం ఇలాగే సాగింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేయగా.. టీమ్ఇండియా ఒక దశలో 85 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్ ద్రవిడ్ (233), వీవీఎస్ లక్ష్మణ్ (148) అద్వితీయమైన ఇన్నింగ్స్‌లతో కోలుకున్న భారత్ 523 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారూలకు 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అదే రీతిలో తాజా మ్యాచ్‌లోనూ పైన్ సేనకు 33 పరుగుల ఆధిక్యమే దక్కింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా కుప్పకూలిన ఆసీస్ 199 పరుగులకే పరిమితమవగా.. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన గంగూలీ సేన చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
భారత్ హాఫ్ = ఫుల్ ఆసీస్
పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు కంటే.. సగం బలంతో కూడిన భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తున్నది. గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఏమాత్రం వెనుకంజ వేయకుండా పోరాడుతున్నది. పరిమిత వనరులతోనే సత్తా చాటుతున్న టీమ్ఇండియా ఈ సిరీస్ గెలుచుకుంటే భారత క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత పెద్ద విజయమవుతుంది. సగం బలంతోనే అద్భుతాలు చేస్తున్న భారత జట్టును చూస్తే గర్వంగా ఉంది.
-షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ పేసర్
వారెవ్వా వాషింగ్టన్
ఆసీస్ ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో మోకాలు వంచుతూ వాషింగ్టన్ సుందర్ కొట్టిన సిక్సర్ ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. తొలి టెస్టు ఆడుతున్న సుందర్ బంతిని సరిగ్గా బ్యాట్ మధ్యలో తీసుకొని లాంగాన్ మీదుగా కొట్టిన ఆ షాట్‌ను చూసి తీరాల్సిందే. అయితే ఆ బంతిని కొట్టిన అనంతరం సుందర్ కనీసం అది ఎటు వెళ్తుందనేది కూడా చూడకపోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని బయటపెట్టింది.
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369, భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్టార్క్ (బి) లియాన్ 44, గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7, పుజారా (సి) పైన్ (బి) హజిల్‌వుడ్ 25, రహానే (సి) వేడ్ (బి) స్టార్క్ 38, మయాంక్ (సి) స్మిత్ (బి) హజిల్‌వుడ్ 38, పంత్ (సి) గ్రీన్ (బి) హజిల్‌వుడ్ 23, సుందర్ (సి) గ్రీన్ (బి) స్టార్క్ 62, శార్దూల్ (బి) కమిన్స్ 67, సైనీ (సి) స్మిత్ (బి) హజిల్‌వుడ్ 5, సిరాజ్ (బి) హజిల్‌వుడ్ 13, నటరాజన్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 336, వికెట్ల పతనం: 1-11, 2-60, 3-105, 4-144, 5-161, 6-186, 7-309, 8-320, 9-328, 10-336, బౌలింగ్: స్టార్క్ 23-3-88-2, హజిల్‌వుడ్ 24.4-6-57-5, కమిన్స్ 27-5-94-2, గ్రీన్ 8-1-20-0, లియాన్ 28-9-65-1, లబుషేన్ 1-1-0-0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హరీస్ (నాటౌట్) 1, వార్నర్ (నాటౌట్) 20, మొత్తం: 6 ఓవర్లలో 21. బౌలింగ్: సిరాజ్ 2-1-12-0, నటరాజన్ 3-0-6-0, సుందర్ 1-0-3-0.
తాజావార్తలు
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్