మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 03, 2020 , 00:59:51

సూపర్‌ సుమిత్‌ ఏడేండ్ల తర్వాత

సూపర్‌ సుమిత్‌ ఏడేండ్ల తర్వాత

  • గ్రాండ్‌స్లామ్‌లో గెలిచినతొలి భారత ఆటగాడిగా రికార్డు 
  • యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో నాగల్‌ గెలుపు 
  • సెరెనా ముందుకు.. వీనస్‌ ఇంటికి

న్యూయార్క్‌:  మంచి అంచనాలతో యూఎస్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన భారత యువ స్టార్‌ సుమిత్‌ నాగల్‌ అదరగొట్టాడు. తొలి రౌండ్‌లో విజయం సాధించి.. ఏడేండ్లలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌డ్రాలో నెగ్గిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన టోర్నీ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో నాగల్‌ 6-1, 6-3, 3-6, 6-1తేడాతో లోకల్‌ ప్లేయర్‌ బ్రాడ్లీ క్లాన్‌పై రెండు గంటల 12నిమిషాల్లో గెలిచాడు. తొలి సెట్‌లో తిరుగులేని ఆటతో రెచ్చిపోయిన నాగల్‌ ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. మూడో సెట్‌లో ప్రత్యర్థి పుంజుకొని ఏస్‌లతో సత్తాచాటడంతో సర్వీస్‌లు కోల్పోయి వెనుకబడ్డాడు. అయితే చివరిసెట్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి పనిని త్వరగా ముగించాడు. మ్యాచ్‌ మొత్తం మీద నాగల్‌ ఒక ఏస్‌ సాధిస్తే.. క్లాన్‌ పదింటితో రాణించాడు. అయితే దూకుడైన ఆటతీరుతో సుమిత్‌ ఆధిపత్యం ప్రదర్శించాడు. చివరగా గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌డ్రాలో నెగ్గిన భారత ప్లేయర్‌గా సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌(2013 యూఎస్‌ ఓపెన్‌) ఉండగా.. ఏడేండ్ల తర్వాత నాగల్‌ ఆ ఫీట్‌ను రిపీట్‌ చేశాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ డొమెనిక్‌ థీమ్‌తో నాగల్‌ గురువారం తలపడనున్నాడు. కాగా మరో మ్యాచ్‌లో ఆండీ ముర్రే 4-6, 4-6, 7-6(7/5), 7-6(7/4), 6-4తేడాతో యషిహిటోపై గెలిచాడు. 

సుమిత్‌..భావి స్టార్‌ 

సోమ్‌దేవ్‌ తర్వాత భారత్‌ తరఫున పురుషుల సింగిల్స్‌ విభాగంలో యూకీ భాంబ్రీ, రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌, ప్రజ్నేశ్‌ గుణేశ్వరణ్‌ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు. అయితే వీరెవరూ గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌డ్రా గెలుపు దరిదాపులకు కూడా వెళ్లలేకపోయారు. రామ్‌కుమార్‌ ఇంతవరకు గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌డ్రాకు అర్హత కూడా సాధించలేదు. 2016 యూఎస్‌ ఓపెన్‌లో సాకేత్‌ మైనేని అడుగుపెట్టినా తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఇలాంటి తరుణంలో గతేడాది యూఎస్‌ ఓపెన్‌లోనే సుమిత్‌ నాగల్‌ అందరినీ ఆకర్షించాడు. తొలి రౌండ్‌లో స్విస్‌ దిగ్గజం, 20గ్రాండ్‌స్లామ్‌ల వీరుడు రోజర్‌ ఫెదరర్‌పై ఓ సెట్‌ గెలిచి అదరగొట్టాడు. మ్యాచ్‌ ఓడినా అభిమానుల హృదయాలను గెలిచాడు. ఈ ఏడాది ఏకంగా రెండో రౌండ్‌లో అడుగుపెట్టి.. పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత టెన్నిస్‌ భవిష్యత్తుపై సుమిత్‌ భరోసా కల్పించాడు.

చెల్లి గెలుపు.. అక్క నిష్క్రమణ 

మహిళల టెన్నిస్‌లో మార్గరెట్‌ కోర్ట్‌(24) అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేసే లక్ష్యంతో యూఎస్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సెరెనా 7-5, 6-3తేడాతో క్రిస్టీ అన్‌పై సునాయాసంగా గెలిచింది. కానీ ఆమె సోదరి వీనస్‌ విలియమ్స్‌ 3-6, 5-7తేడాతో కరోలినా ముచోవా చేతిలో ఓడి ఆదిలోని నిష్క్రమించింది. యూఎస్‌ ఓపెన్‌ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించడం వీనస్‌కు ఇది తొలిసారి.   


logo