బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 17, 2020 , 17:18:18

RR vs RCB: స్టీవ్‌ స్మిత్‌, ఉతప్ప మెరుపులు

RR vs RCB: స్టీవ్‌ స్మిత్‌, ఉతప్ప మెరుపులు

దుబాయ్:  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ పోరాడే స్కోరు సాధించింది.  కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(57: 36 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) అద్భుత అర్ధసెంచరీకి తోడు ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప(41: 22 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌)  రాణించడంతో  రాజస్థాన్‌ 20 ఓవర్లలో   6 వికెట్లకు 177 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌(24 25 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు.  బెంగళూరు బౌలర్లలో చాహల్‌(2/34), క్రిస్‌ మోరీస్‌(4/26) రాజస్థాన్‌ను దెబ్బకొట్టారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు శుభారంభం లభించింది.   పవర్‌ ప్లే ఆఖరికి ఆ జట్టు వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. సీజన్‌లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన ఉతప్ప బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.  ఓపెనర్‌గా ఈ మ్యాచ్‌లోనూ బెన్‌స్టోక్స్‌(15 19బంతుల్లో 2ఫోర్లు) విఫలమయ్యాడు.  క్రిస్‌ మోరీస్‌ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌ ఔటయ్యాడు.  వీరిద్దరూ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు.  యుజువేంద్ర చాహల్‌ దెబ్బకు  ఒకే ఓవర్లో రాజస్థాన్‌ రెండు వికెట్లు కోల్పోయింది.  చాహల్‌ వేసిన ఎనిమిదో  ఓవర్‌లో రాబిన్‌ ఉతప్ప(41),  సంజూ శాంసన్‌(9) వరుస బంతుల్లో  పెవిలియన్‌ చేరారు. 

అంతకుముందు తొలి బంతిని భారీ సిక్సర్‌ కొట్టిన  శాంసన్‌  జోరుగా కనిపించాడు.   తర్వాత సింగిల్‌ తీయగా  నాలుగో బంతికి ఉతప్ప, ఐదో బంతికి సంజూ క్యాచ్‌ ఔటయ్యారు.   ఒకానొక దశలో 50/1తో నిలిచిన రాజస్థాన్‌ చాహల్‌ దెబ్బకు 69/3తో కష్టాల్లో పడింది.  ఈ స్థితిలో  బట్లర్‌తో   కలిసి స్మిత్‌  ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. క్రిస్‌ మోరీస్‌ వేసిన 16వ ఓవర్లో వేగంగా ఆడే క్రమంలో బట్లర్‌ వెనుదిరిగాడు.   మూడో బంతికి భారీ షాట్‌ ఆడి సైనీ చేతికి చిక్కాడు. మధ్య ఓవర్లలో  స్మిత్‌, బట్లర్‌ ఆచితూచి ఆడారు. 

13వ ఓవర్‌లో రాజస్థాన్‌ 100 పరుగులు దాటింది.  వీరిద్దరూ 58  పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  మరో ఎండ్‌లో స్మిత్‌ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. చాహల్‌ వేసిన 18వ ఓవర్లో 3ఫోర్లు బాది 17 రన్స్‌ రాబట్టాడు.  ఈ క్రమంలోనే 30 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.  19వ ఓవర్లో రాహుల్‌ తెవాటియా(19) ఫోర్‌, సిక్సర్‌ కొట్టి 15 పరుగులు సాధించాడు.  ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన మోరీస్‌ కేవలం 4 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.