బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 02:46:49

సిట్సిపాస్‌ ఔట్‌

సిట్సిపాస్‌ ఔట్‌

  • మూడో రౌండ్‌లో కొరిచ్‌ చేతిలో ఓటమి 
  • ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్‌, జ్వెరెవ్‌, ఒసాక
  • రెండో రౌండ్‌ చేరిన బోపన్న ద్వయం

 న్యూయార్క్‌:  యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మరో స్టార్‌ ప్లేయర్‌ వైదొలిగాడు. పురుషుల సింగిల్స్‌ నాలుగో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌(గ్రీకు) టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో సిట్సిపాస్‌ 7-6(7/2), 4-6, 6-4, 5-7, 6-7(4/7) తేడాతో 27వ సీడ్‌ బోర్నా కొరిచ్‌(క్రొయేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఐదు సెట్ల పాటు నాలుగున్నర గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో చివరి దాకా పోరాడినా సిట్సిపాస్‌కు ఓటమి తప్పలేదు. నాలుగో సెట్‌లో ఆరు మ్యాచ్‌ పాయింట్లను చేజార్చుకున్న స్టెఫనోస్‌ ఆఖరి సెట్‌ టై బ్రేకర్‌లోనూ రాణించలేక ఇంటి ముఖం పట్టాడు.  హోరాహోరీగా సాగిన పోరులో సిట్సిపాస్‌ మొత్తం 16ఏస్‌లు బాదగా, కొరిచ్‌ నాలుగు సాధించాడు. ప్రత్యర్థి కన్నా సిట్సిపాస్‌ ఆరు విన్నర్లు(59) ఎక్కువ సాధించినా ఓటమి తప్పలేదు. ఇక ఈ సీజన్‌లో ఓటమి ఎరుగకుండా సాగుతున్న ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌(సెర్బియా)  ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. మూడో రౌండ్‌లో జొకో 6-3, 6-3, 6-1 తేడాతో జాన్‌ లెనార్డ్‌ స్టఫ్‌(జర్మనీ)పై సునాయాసంగా గెలిచాడు.  

ఒసాక కష్టంగా.. 

  మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ నవోమీ ఒసాక(జపాన్‌) 6-3, 6-7(4/7), 6-2  తేడాతో మర్టా కోస్టుక్‌(ఉక్రెయిన్‌)పై చెమటోడ్చి గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరింది.  క్విటోవా 6-4, 6-3 తేడాతో జెస్సికా పెగులాపై గెలిచింది. రెండో రౌండ్‌ పోటీలో మూడో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ 6-2, 6-4తేడాతో మార్గరిటా పై నెగ్గింది.

బోపన్న జోడీ ముందుకు.. 

  భారత ఆటగాడు రోహన్‌ బోపన్న ముందంజ వేశాడు. తొలి రౌండ్‌లో రోహన్‌, డెనిస్‌ షాపలోవ్‌(కెనడా) ద్వయం 6-2, 6-4తేడాతో అమెరికా జోడీ ఎస్కోబెడో, నోవా రుబిన్‌పై విజయం సాధించారు.  


logo