శనివారం 11 జూలై 2020
Sports - Apr 25, 2020 , 00:37:15

అమ్మ ఆశీర్వాదంతో మొదలై..

అమ్మ ఆశీర్వాదంతో మొదలై..

  • సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ 

ముంబై: ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే. ఈ నానుడిని నిజం చేస్తూ అంతర్జాతీయ క్రికెట్‌పై చెరుగని ముద్ర వేసిన మేరునగధీరుడు సచిన్‌ టెండూల్కర్‌ అమ్మ ఆశీర్వాదంతో పుట్టిన రోజు ప్రారంభించానని పేర్కొన్నాడు. శుక్రవారం 47వ పడిలోకి అడుగుపెట్టిన క్రికెట్‌ దేవుడు సచిన్‌..అమ్మ ప్రత్యేకంగా ఇచ్చిన వినాయకుడి చిత్ర పటం తనకెంతో అపురూపమైందని ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు. ప్రపంచ క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు తన పేరిట రాసుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ), బీసీసీఐ నుంచి తాజా, మాజీ ఆటగాళ్ల వరకు ఈ జాబితాలో ఉన్నారు. 

వేడుకలకు దూరం 

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈసారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండిపోయిన మాస్టర్‌..సామాజిక మాధ్యమాల ద్వారా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఆటతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న మాస్టర్‌కు కేవలం క్రీడారంగ ప్రముఖులే కాక సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు కూడా అభినందనలు తెలిపారు. ‘తన ఆటతో ఎందరో ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలిచిన సచిన్‌ పాజీకి పుట్టి న రోజు శుభాకాంక్షలు’ అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్‌ చేశాడు. 

కాలాన్ని ఆపగల ధీరుడు: వీరూ 

భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో సచిన్‌తో కలిసి జట్టుకు ఎన్నో అద్భుత ఆరంభాలు అందించిన వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. 2007లో వన్డే ప్రపంచకప్‌ సమయంలో నిరాశగా చూస్తున్న సచిన్‌ ఫొటోతో పాటు 2011 వరల్డ్‌కప్‌ నెగ్గిన తర్వాత సంబురాల్లో మునిగిపోయిన స్టిల్‌ను జతచేసి వీరూ ఇలా రాసుకొచ్చాడు. ‘విజయం ఎప్పటికైనా సిద్ధిస్తుంది. దాన్ని మీరు నిరూపించారు. అద్భుత బ్యాటింగ్‌ నైపుణ్యంతో కాలాన్ని ఆపగల ధీరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే..ప్రతీ ప్రతికూలత తర్వాత ఓ విజయం ఉంటుంది’ అని ట్వీట్‌ చేశాడు. భారత మాజీ ఆటగాళ్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, యువరాజ్‌ సింగ్‌, వినోద్‌ కాంబ్లీతో పాటు చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి, రోహిత్‌శర్మ, బుమ్రా, రహానే, హర్భజన్‌సింగ్‌, బ్రెట్‌లీ, టీటీ స్టార్‌  శరత్‌ కమల్‌ తదితరులు సచిన్‌కు అభినందనలు తెలిపారు.


logo