ఆదివారం 09 ఆగస్టు 2020
Sports - Jul 05, 2020 , 02:44:42

డబుల్‌ రోల్‌

డబుల్‌ రోల్‌

ఏదైనా ఒక క్రీడలో దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఒకే ప్లేయర్‌ రెండు వేర్వేరు క్రీడాంశాల్లో జాతీయ జట్టు తరఫున బరిలో దిగితే.. సూపర్‌ కదా! బక్క పలచని శరీరం.. ముఖంపై చెరగని చిరునవ్వుతో సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌.. క్రికెటర్‌ కాకముందు చదరంగంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడంటే నమ్మగలరా!

అసమాన ప్రతిభతో.. ఒంటిని విల్లులా వంచి పక్షిలా ఎగురుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఫీల్డింగ్‌కు కొత్త ప్రమాణాలు నెలకొల్పిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌ అంతకుముందు హాకీ స్టిక్‌తో తన దేశానికి విజయాలు అందించిన విషయం తెలుసా! వీళ్లు మాత్రమే కాదు.. సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌, వివియన్‌ రిచర్డ్స్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌, ఎలీస్‌ పెర్రీ, సూజీ బేట్స్‌, ఇయాన్‌ బోథమ్‌ క్రికెట్‌తో పాటు ఇతర ఆటల్లోనూ తమ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మరి ఈ ప్రతిభావంతుల రెండో క్రీడ గురించి తెలుసుకోవాలిగా.. పదండి 

ఓ లుక్కేద్దాం.

క్రికెట్‌ దిగ్గజం సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ను ఆదర్శంగా తీసుకున్న కొందరు ఆటగాళ్లు.. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ ప్రావీణ్యం సంపాదించి జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ స్థాయిలో రెండు వేర్వేరు క్రీడాంశాల్లో దేశం తరఫున ఆడటం కష్టమైన పనే అ యినా.. ఆటపై ఉన్న ఇష్టంతో అవరోధాలను అధిగమిస్తూ ముందడుగేశారు. ఇందులో కొందరు క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభించక ముందే ఇతర క్రీడలో దుమ్మురేపితే.. మరికొందరు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక వేరే ఆటపై దృష్టిపెట్టారు.

చెస్‌ కింగ్‌ చాహల్‌..

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా.. టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ చిన్నప్పటి నుంచే చదరంగంలో ఆరితేరాడు. ఎత్తుకు పైఎత్తు వేయడం.. ప్రత్యర్థిని చిత్తు చేయడం పసిప్రాయంలోనే అవపోసన పట్టిన చాహల్‌ జూనియర్‌ స్థాయిలో జాతీయ జట్టు తరఫున ఆడాడు. 2002లో అండర్‌-12 జాతీయ చాంపియన్‌గా నిలిచిన చాహల్‌ ఆ తర్వాత స్పాన్సర్ల కొరతతో చదరంగాన్ని వీడి క్రికెట్‌ బాట పట్టాడు. 2011 ఐపీఎల్‌లో తొలిసారి ముంబై ఇండియన్స్‌కు ఎంపికైన చాహల్‌ దినదినాభివృద్ధి చెందుతూ.. జాతీయ జట్టులో చోటు దక్కించుకొని ప్రస్తుతం టీమ్‌ఇండియాలో కీలక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు.

ఫ్లింటాఫ్‌ బాక్సింగ్‌ పంచ్‌


మైదానంలో దూకుడుగా కనిపించే ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాక తన స్వభావానికి తగ్గ బాక్సింగ్‌ క్రీడలో అరంగేట్రం చేశాడు. 2009లో ఆటకు అల్విదా చెప్పిన ఫ్లింటాఫ్‌.. 2012లో బాక్సింగ్‌ రింగ్‌లో అడుగుపెట్టాడు. అమెరికన్‌ బాక్సర్‌ రిచర్డ్‌ డాసన్‌పై విజయం సాధించిన అతడు.. ఆ తర్వాత బాక్సింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి కామెంట్రీ వైపు అడుగులు వేశాడు.                     

ఆద్యుడు ఆయనే..


ఆస్ట్రేలియా దిగ్గజం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ గురించి తెలియని క్రికెట్‌ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. టెస్టు క్రికెట్‌లో 29 శతకాలు, 12 డబుల్‌ సెంచరీలు, 99.94 సగటు నమోదు చేసిన బ్రాడ్‌మన్‌.. ఓవైపు క్రికెట్‌లో కొనసాగుతూనే స్కాష్‌, గోల్ఫ్‌లో బరిలోదిగి అక్కడ కూడా డాన్‌ అనిపించుకున్నారు.

ఫుట్‌బాల్‌కు బాయ్‌ చెప్పి  క్రికెట్‌లోకి


రెండు ప్రపంచకప్‌ (1975, 79)లు నెగ్గిన వెస్టిండీస్‌ జట్టులో సభ్యుడైన వివియన్‌ రిచర్డ్స్‌.. అంతకుముందు ఫుట్‌బాల్‌లోనూ అదరగొట్టాడు. 1974 ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో అంటిగ్వా తరఫున బరిలో దిగిన వివ్‌.. ఆ తర్వాత క్రికెట్‌పై దృష్టిపెట్టి ఫుట్‌బాల్‌కు టాటా చెప్పాడు. ఇప్పటికీ ఇంగ్లిష్‌ ప్రిమియర్‌ లీగ్‌ అంటే పడిచచ్చే రిచర్డ్స్‌.. లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు వీరాభిమాని. 

మేమేం తక్కువా..! 


మహిళల్లోనూ ఇలాంటి ప్రతిభావంతులు ఉన్నారు. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ సూజీ బేట్స్‌ది బాస్కెట్‌బాల్‌లో అందెవేసిన చేయి. ఆమె 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కివీస్‌ జట్టుకు ఆడింది. క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున 4వేలకు పైగా పరుగులు చేసిన బేట్స్‌.. కెప్టెన్సీ కారణంగా బాస్కెట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పింది. ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. పదహారేండ్ల వయసులోనే ఆసీస్‌ క్రికెట్‌ జట్టుకు ఎంపికైన పెర్రీ.. టీ20 ప్రపంచకప్‌ (2010) నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది. తర్వాతి ఏడాదే ఆమె మరో విశ్వటోర్నీ ఆడింది. అదెలా అనుకుంటున్నారా.. ఈసారి పెర్రీ బరిలో దిగింది క్రికెట్‌లో కాదు.. ఫుట్‌బాల్‌లో. 2011 ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో ఎలీస్‌ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.

వీళ్లతో పాటు ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌, న్యూజిలాండ్‌ ఆటగాడు నాథన్‌ ఆష్లే కూడా క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లో తమ సత్తాచాటారు. బోథమ్‌ ఫుట్‌బాల్‌లో.. ఆటోరేసింగ్‌లో ఆష్లే అడుగుపెట్టి స్ఫూర్తివంతమైన విజయాలు సొంతం చేసుకున్నారు. భారత క్రికెట్‌ దిగ్గజం, హర్యానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌ అవతారమెత్తిన విషయం తెలిసిందే.