ఒలింపిక్స్.. ప్రతి నాలుగేండ్లకోసారి ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేసుకునే క్రీడా పండుగ. సరిహద్దులు మరిచి సత్తాచాటే అత్యుత్తమ క్రీడా వేదిక. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యంగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ ప్రపంచ క్రీడాభిమానులను అలరించేందుకు అన్ని హంగులతో సిద్ధమైంది. వైరస్ విజృంభణ నేపథ్యంలో చరిత్రలో తొలిసారి ప్రేక్షకుల్లేకుండానే జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడా వేదికలు అబ్బురపరిచే రీతిలో అదరహో అనిపిస్తున్నాయి. మొత్తం 42 వేదికల్లో మచ్చుకు కొన్నింటిపై మనమూ ఓ లుక్కెద్దాం పదండి.
టోక్యో: విశ్వక్రీడా సంబురానికి సమయం సమీపిస్తున్నది. 13 రోజుల వ్యవధిలో ప్రపంచ అత్యుత్తమ క్రీడా సంగ్రామం మొదలుకాబోతున్నది. కరోనా వైరస్ వ్యాప్తి క్రమంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జపాన్ ప్రభుత్వం విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వబోతున్నది. మెగాటోర్నీ పట్ల ఓవైపు స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా.. నిర్వహణకే మొగ్గుచూపుతున్నది. ఈ నేపథ్యంలో చారిత్రక ఒలింపిక్స్ నేషనల్ స్టేడియంతో పాటు కీలక వేదికల విశేషాలేంటో తెలుసుకుందాం.
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకులకు ఆతిథ్యమిచ్చే ప్రధాన స్టేడియం. 1964లో చివరిసారి టోక్యోలో జరిగిన విశ్వక్రీడలకు వేదికైన ఆవరణలోనే స్టేడియాన్ని అత్యుత్తమ టెక్నాలజీతో నిర్మించారు. ఐదు అంతస్తుల నిర్మాణం కల్గిన ఈ స్టేడియంలో అథ్లెటిక్స్‌తో పాటు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
జపాన్ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్‌కు నిప్పన్ బుడోకాన్ వేదిక. జపాన్ అభిమానుల గుండెల్లో దీనికి ప్రత్యేకమైన స్థానముంది. చియోడాలో ఉన్న ఈ స్టేడియం కరాటే, జూడో ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనుంది.
సామర్థ్యం 11,000
షిబుయాలోని యోయోగి పార్క్‌లో సస్పెన్షన్ రూఫ్ డిజైన్‌తో ఈ స్టేడియాన్ని నిర్మించారు. టోక్యోలో నిర్మితమైన అత్యుత్తమ కట్టడాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. గత ఒలింపిక్స్‌లో ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్‌కు ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియం.. ఈసారి హ్యాండ్‌బాల్‌కు వేదిక కానుంది.
ఓయి పియర్ ఓషియన్ పార్క్‌లో నిర్మితమైన ఈ స్టేడియంలో హాకీ మ్యాచ్‌లు జరుగనున్నాయి. కొత్తగా కట్టిన ఈ స్టేడియం అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నది. అర్జెంటీనా, బెల్జియం, ఆస్ట్రేలియా, భారత్, జర్మనీ లాంటి అత్యుత్తమ జట్లు ఈ స్టేడియంలో పోటీపడనున్నాయి.
సామర్థ్యం 15,000
అరియాకె టెన్నిస్ పార్క్.. అత్యుత్తమ సదుపాయాలను కల్గి ఉన్నది. ఇండోర్, ఔట్‌డోర్ కోర్టులు కల్గి ఉన్న ఈ స్టేడియం ఫోల్డేబుల్ రూఫ్ నిర్మాణంతో రూపుదిద్దుకుంది. ఇది వరకు జపాన్ ఓపెన్, పాన్ పసిఫిక్ ఓపెన్ ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియంలో ఒలింపిక్స్ టెన్నిస్ మ్యాచ్‌లు జరుగుతాయి.
సామర్థ్యం 19,900