బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 27, 2020 , 00:56:53

ఒక్క సిక్స్‌ లేకుండానే..

ఒక్క సిక్స్‌ లేకుండానే..
  • వన్డేలో అత్యధిక స్కోరు చేసిన శ్రీలంక

కొలంబో:  వన్డే క్రికెట్‌లో శ్రీలంక జట్టు కొత్త రికార్డు నెలకొల్పింది. ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా లేకుండానే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా చరిత్ర పుటల్లోకెక్కింది. ఓపెనర్‌ అవిష్కా ఫెర్నాండో (127; 10 ఫోర్లు), కుషాల్‌ మెండిస్‌ (119; 12 ఫోర్లు) రికార్డు భాగస్వామ్యంతో చెలరేగడంతో..  వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 161 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలుపొందిన లంక.. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన పోరులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 345 పరుగులు చేసింది. కెప్టెన్‌ కరుణరత్నె (1), కుషాల్‌ పెరీరా (0) విఫలమవడంతో 9/2తో కష్టాల్లో పడ్డ లంకను ఫెర్నాండో, మెండిస్‌ ఆదుకున్నారు. 


వీరిద్దరూ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 239 పరుగులు జతచేశారు. లంక తరఫున వన్డేల్లో మూడో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. లంక ఇన్నింగ్స్‌లో మొత్తం 33 బౌండ్రీలు నమోదు కాగా.. అందులో ఒక్క సిక్సర్‌ కూడా లేకపోవడం విశేషం. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌కు 4, జోసెఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం టార్గెట్‌ ఛేజింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో విండీస్‌ 39.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. షై హోప్‌ (51) ఒక్కడే హాఫ్‌సెంచరీ చేశాడు. లంక బౌలర్లలో సందకన్‌, హసరంగ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.


logo
>>>>>>