సోమవారం 06 జూలై 2020
Sports - Jun 13, 2020 , 12:35:30

శ్రీలంకలో ఆసియా క్రికెట్‌ కప్‌!

శ్రీలంకలో ఆసియా క్రికెట్‌ కప్‌!

కొలంబో: కరోనా నుంచి ప్రపంచం కోలుకుని సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఈ ఏడాది ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీ శ్రీలంకలో జరగనుంది. సెప్టెంబరులో ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేశారు. అయితే, ఈసారి ఆసియా కప్‌ నిర్వహణ హక్కులు పాకిస్తాన్‌కు ఉన్నాయి. భారత్‌ కూడా ఇందులో పాల్గొంటున్నది. దీంతో పాక్‌లో మ్యాచ్‌ సాధ్యపడదు. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణ హక్కులు ఈ సారి శ్రీలంకకు ఇచ్చి 2022 ఆసియా కప్‌ను తమకు ఇవ్వాలని పాకిస్తాన్‌ బోర్డు (పీసీబీ) కోరింది. దీనికి శ్రీలంక బోర్డు అంగీకరించింది. ఈ టోర్నీ ఎక్కడ నిర్వహించాలనేదానిపై ఆసియా క్రికెట్‌ కప్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెలాఖరులోగా తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

ఇదిలా ఉంటే, ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ప్రస్తుతం శ్రీలంకలో మాత్రం కరోనా విజృంభణ కొంత తక్కువగానే ఉంది. అయినా టోర్నీ నిర్వహణ అంత ఈజీ కాదు. తాజాగా భారత జట్టు కూడా శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్న విషయం విదితమే. కనీసం ఆరు దేశాల జట్లు పాల్గొనే ఆసియా కప్‌ కోసం ఆరోగ్య సంబంధిత ఏర్పాట్లు పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. అలాగే, అంతర్జాతీయ ప్రయాణాల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, 2010లో చివరిసారిగా ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు అవకాశమొస్తే విజయవంతంగా టోర్నీ నిర్వహిస్తామని ఆ దేశం ధీమా వ్యక్తం చేస్తున్నది.   logo