సోమవారం 30 నవంబర్ 2020
Sports - Nov 06, 2020 , 23:13:23

క్వాలిఫయర్‌-2కు సన్‌రైజర్స్‌

క్వాలిఫయర్‌-2కు  సన్‌రైజర్స్‌

అబుదాబి: ఐపీఎల్‌లో రెండోసారి టైటిల్‌ నెగ్గేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  మరింత ముందడుగు వేసింది. సన్‌రైజర్స్‌ క్వాలిఫయర్‌-2 పోరుకు అర్హత సాధించింది.  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో   ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో సత్తాచాటింది.  శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎలిమినేటర్‌లో ఓటమితో కోహ్లీసేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. 

132 పరుగుల లక్ష్య ఛేదనలో కేన్‌ విలియమ్సన్‌(50 నాటౌట్:‌ 44 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో రాణించడంతో హైదరాబాద్‌ 4 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.   ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌(24 నాటౌట్‌ 20 బంతుల్లో 3ఫోర్లు) తనదైన శైలిలో  కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. గోస్వామీ(0), డేవిడ్‌ వార్నర్‌(17), మనీశ్‌ పాండే(24) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 

అంతకుముందు  ఏబీ డివిలియర్స్‌(56: 43 బంతుల్లో 5ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. అరోన్‌ ఫించ్(32: 30 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) కొంతసేపు పోరాడటంతో బెంగళూరు ఆమాత్రం స్కోరు చేసింది.

కీలక పోరులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(6) మరోసారి నిరాశపరిచాడు. ఫామ్‌లో ఉన్న దేవదత్‌ పడిక్కల్‌(1), మొయిన్‌ అలీ(0), శివమ్‌ దూబే(8), వాషింగ్టన్‌ సుందర్‌(5) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.