గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 08, 2020 , 21:32:34

SRH vs KXIP: ఆహా.. ఇది కదా ఆటంటే!

SRH vs KXIP: ఆహా.. ఇది కదా ఆటంటే!

దుబాయ్: ఐపీఎల్‌-13  సీజన్‌లో తొలిసారిగా స్థాయికి తగ్గ ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో  అదరగొట్టాడు. బెయిర్‌స్టో(97:  55 బంతుల్లో  7ఫోర్లు, 6సిక్సర్లు)   శతక సమాన ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో సన్‌రైజర్స్‌ భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(52: 40 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌) కూడా అర్ధశతకంతో రాణించడంతో  20 ఓవర్లో హైదరాబాద్‌ 6 వికెట్లకు 201 పరుగులు చేసింది.  మధ్య ఓవర్ల వరకు పంజాబ్‌ బౌలర్లు దారుణంగా బౌలింగ్‌ చేశారు.

స్పిన్నర్లు, పేసర్లు అందరి బౌలింగ్‌లో ఓపెనింగ్‌ జోడీ చితక్కొట్టింది.  పంజాబ్‌ యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ (3/29), అర్షదీప్‌ సింగ్‌(2/33) మాత్రమే హైదరాబాద్‌ను కట్టడి చేశారు.   తాను ఫామ్‌లో ఉంటే ఎలా ఉంటుందో ఓపెనర్‌   బెయిర్‌స్టో  నిరూపించాడు. అటు వార్నర్‌  కూడా పోటాపోటీగా బ్యాటింగ్‌ చేశాడు. టాస్‌ గెలిచి  బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను  బెయిర్‌స్టో   ఒంటి చేత్తో నడిపించాడు.  ఏ దశలోనూ ఇబ్బంది పడని బెయిర్‌స్టో...కెప్టెన్‌ వార్నర్‌తో కలిసి  చక్కటి  ఆటతీరుతో   బౌలర్లకు చుక్కలు చూపించాడు.  పంజాబ్‌పై యధేచ్ఛగా విరుచుకుపడిన బెయిర్‌స్టో జట్టును పటిష్ఠస్థితిలో నిలిపాడు.   

ఓపెనర్లు   పవర్‌ప్లేలో భారీ హిట్టింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.  కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే  వార్నర్‌ వరుసగా రెండు ఫోర్లు బాదగా,  5 ఎక్స్‌ట్రా రన్స్‌ రావడంతో 13 పరుగులు వచ్చాయి.   అనూహ్యంగా రెండో ఓవర్‌లోనే కేఎల్‌ రాహుల్‌.. స్పిన్నర్‌ ముజీబ్‌ను రంగంలోకి దించాడు. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ముజీబ్‌ కేవలం 6 పరుగులు ఇచ్చాడు. కాట్రెల్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌స్టో  మూడు  ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు.    మొదటి ఓవర్‌ నుంచే సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. 6 ఓవర్లకు   హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.  ఈ సీజన్‌లో  పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌కిదే అత్యధిక స్కోరు.  

మాక్స్‌వెల్‌ వేసిన 11వ ఓవర్లో బెయిర్‌స్టో వరుసగా 4,6, 6 బాది 20 రన్స్‌ రాబట్టడంతో స్కోరు 120 దాటింది.    బెయిర్‌స్టో 28 బంతుల్లోనే 50 మార్క్‌ చేరుకోగా..ఆచితూచి ఆడిన వార్నర్‌ 37 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ వేసిన 16వ ఓవర్లో హైదరాబాద్‌ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఓవర్‌ మొదటి బంతికి డేవిడ్‌ వార్నర్(52)‌..మాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగ్గా.. సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టిన బెయిర్‌స్టో నాలుగో బంతికి ఎల్బీడబ్లూగా పెవిలియన్‌ చేరాడు.

నాలుగు బంతుల వ్యవధిలో కుదురుకున్న ఓపెనర్లను బిష్ణోయ్‌ ఔట్‌ చేసి భారీ భాగస్వామ్యానికి తెరదించాడు.  తొలి వికెట్‌కు ఓపెనింగ్‌ జోడీ 92 బంతుల్లో 160 రన్స్‌ రాబట్టింది.  ఇన్నింగ్స్‌ ఆఖర్లో బిష్ణోయ్‌, అర్షదీప్‌ ధాటికి సన్‌రైజర్స్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కేన్‌ విలియమ్సన్‌(20 నాటౌట్‌  10 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌) ఆఖరి బంతి వరకు క్రీజులో ఉండి జట్టు స్కోరు 200 దాటించాడు.