బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Sep 26, 2020 , 21:29:08

పాండే పోరాటం..సన్‌రైజర్స్‌ స్కోరు 142

పాండే పోరాటం..సన్‌రైజర్స్‌ స్కోరు 142

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. మనీశ్‌ పాండే(51: 38 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్‌ 4 వికెట్లకు 142 పరుగులు చేసింది.  ఏ దశలోనూ సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో జోరు కనిపించలేదు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(36), వృద్ధిమాన్‌ సాహా(30) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేశారు. బ్యాట్స్‌మన్‌ స్వేచ్ఛగా ఆడకుండా నిలువరించారు. 

సన్‌రైజర్స్‌కు ఈసారి శుభారంభం లభించలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టు  ఇన్నింగ్స్‌   మెరుపులు లేకుండానే సాగింది.  పాట్‌ కమిన్స్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌ స్టో(5) బౌల్డ్‌ అయ్యాడు.  వార్నర్‌(36) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.  యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌ ..రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి  వెనుదిరిగాడు. 

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌  ఫామ్‌లో లేకపోవడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది.  వార్నర్ వెనుదిరగడంతో స్కోరు వేగం మందగించింది.  మనీశ్‌ పాండే ఒక్కడే స్ఫూర్తిదాయక ప్రదర్శనతో   జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మరో ఎండ్‌లో వృద్ధిమాన్‌ సాహా నిదానంగా బ్యాటింగ్‌ చేశాడు. మధ్య ఓవర్లలో  కోల్‌కతా బౌలర్లు పరుగులను నియంత్రించారు.