సన్‌రైజర్స్ హైదరాబాద్.. అందుకు తగ్గట్లే విజృంభించింది. హిట్టర్లతో దట్టంగా ఉన్న పంజాబ్ కింగ్స్‌ను సాధారణ స్కోరుకే కట్టడి చేసింది. విండీస్ వీరుడు హోల్డర్ మూడు వికెట్లతో దుమ్మురేపితే.. తక్కిన వాళ్లంతా తలో వికెట్ తీసి పంజాబ్‌ను 125 పరుగులకు పరిమితం చేశారు. ఇంకేముంది హైదరాబాద్ విజయం ఖాయమే అని అనుకుంటున్న దశలో మన బ్యాటింగ్ పేకమేడను తలపించింది. వార్నర్, విలియమ్సన్, పాండే, జాదవ్ ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టడంతో రైజర్స్‌కు పరాజయం తప్పలేదు. ఆఖర్లో హోల్డర్ సిక్సర్లు కూడా జట్టును గట్టెక్కించ లేకపోయాయి!
పంజాబ్ కింగ్స్‌కు ఊరట విజయం
షార్జా: బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలమవడంతో హైదరాబాద్ వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. డబుల్ హెడర్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. రైజర్స్ బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. 27 పరుగులు చేసిన ఎయిడెన్ మార్కరమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (21), క్రిస్ గేల్ (14), మయాంక్ (5), పూరన్ (8), దీపక్ హుడా (13) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులకే పరిమితమైంది. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ (2), కేన్ విలియమ్సన్ (1) ఘోరంగా విఫలం కాగా.. మనీశ్ పాండే (13), కేదార్ జాదవ్ (12) పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో హైదరాబాద్ 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వృద్ధిమాన్ సాహా (31) అండతో జాసన్ హోల్డర్ (29 బంతుల్లో 47 నాటౌట్; 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. ఎడాపెడా సిక్సర్లు కొట్టడంతో రైజర్స్ లక్ష్యానికి చేరువైంది. అయితే కీలక సమయాల్లో సాహాతో పాటు రషీద్ ఖాన్ (3) ఔట్ కావడంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లో రైజర్స్ విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. ఒక సిక్సర్ బాది ఆశలు రేపిన హోల్డర్.. ఆ తర్వాత భారీ షాట్లు ఆడలేకపోవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టారు. హోల్డర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు
పంజాబ్: రాహుల్ (సి) (సబ్) సుచిత్ (బి) హోల్డర్ 21, మయాంక్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 5, గేల్ (ఎల్బీ) రషీద్ 14, మార్క్మ్ (సి) పాండే (బి) సమద్ 27, పూరన్ (సి అండ్ బి) సందీప్ 8, దీపక్ (సి) (సబ్) సుచిత్ (బి) హోల్డర్ 13, హర్‌ప్రీత్ (నాటౌట్) 18, ఎలీస్ (సి) పాండే (బి) భువనేశ్వర్ 12, షమీ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 125/7. వికెట్ల పతనం: 1-26, 2-27,3-57, 4-66, 5-88, 6-96, 7-118, బౌలింగ్: సందీప్ 4-0-20-1, భువనేశ్వర్ 4-0-34-1, హోల్డర్ 4-0-19-3, ఖలీల్ 3-0-22-0, రషీద్ 4-0-17-1, సమద్ 1-0-9-1.
హైదరాబాద్: వార్నర్ (సి) రాహుల్ (బి) షమీ 2, సాహా (రనౌట్) 31, విలియమ్సన్ (బి) షమీ 1, పాండే (బి) రవి 13, జాదవ్ (బి) రవి 12, సమద్ (సి) గేల్ (బి) రవి 1, హోల్డర్ (నాటౌట్) 47, రషీద్ (సి అండ్ బి) అర్శ్‌దీప్ 3, భువనేశ్వర్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 120/7. వికెట్ల పతనం: 1-2, 2-10, 3-32, 4-56, 5-60, 6-92, 7-105, బౌలింగ్: షమీ 4-1-14-2, అర్శ్‌దీప్ 4-0-22-1, ఎలీస్ 4-0-32-0, హర్‌ప్రీత్ 4-0-25-0, రవి 4-0-24-3.