శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 02, 2020 , 19:37:31

రోజు 16 గంటలు.. ఆ టార్చర్‌ మరిచిపోనిది

రోజు 16 గంటలు.. ఆ టార్చర్‌ మరిచిపోనిది

న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టులో ప్రభావవంతమైన బౌలర్‌గా తనదైన ముద్ర వేసుకొన్న శ్రీశాంత్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసుతో అధఃపాతాళానికి  వెళ్లిపోయారు. 2013 లో ఫిక్సింగ్‌ ఆరోపణలు శ్రీశాంత్‌ కెరీర్ విపరీతమైన మలుపు తీసుకుంది. ఫిక్సింగ్ ఆరోపణలపై జీవితకాలం నిషేధానికి గురయ్యాడు. అనంతర కాలంలో నిషేధాన్ని ఏడేండ్లకు తగ్గించినప్పటికీ, జీవితాంతం మరిచిపోలేని సంఘటనగా నిలిచిపోయింది. 

ఫిక్సింగ్ కేసులో తనను విచారించేందుకు ప్రత్యేక పోలీసులు ఉగ్రవాదులను ఉంచే వార్డుకు తీసుకెళ్లారని ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా శ్రీశాంత్‌ వెల్లడించారు. తాను ఎంతగానో ప్రేమించే కుటుంబం నుంచి దూరమైన ఆ సమయం తనకు తీవ్రమైన హింసకు గురిచేసిందని చెప్పారు. 'వరుసగా 12 రోజులు నిత్యం 16 గంటలపాటు విచారణ చేశారు. నేను ఆ సమయంలో నా ఇల్లు, నా కుటుంబం గురించే ఆలోచిస్తూ గడిపాను. కొన్నిరోజుల తరువాత నా అన్నయ్య నన్ను చూడటానికి వచ్చాడు. నా కుటుంబ సభ్యులు నాకు పూర్తి అండగా నిలిచారు' అని తెలిపారు. జీవితంలో ప్రతి పోరాటం ముఖ్యమేనని, అందరూ తమతమ స్థాయిల్లో ఏదో ఒక పోరాటం చేస్తున్నారని శ్రీశాంత్‌ అన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 సెకన్లపాటు ఆలోచించండి అని శ్రీశాంత్‌ సూచిస్తున్నారు. 

ధోని నేతృత్వంలోని రెండు ప్రపంచ కప్‌లు సాధించిన జట్టులో సభ్యుడు. అతను భారత క్రికెట్ నుంచి నిష్క్రమించే వరకు టీమిండియా తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20 లో 7 వికెట్లు పడగొట్టాడు. శ్రీశాంత్‌ చివరిసారిగా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. దీనికి ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ తరపున ఆడాడు. ఈయనపై విధించిన నిషేధం త్వరలో తొలిగిపోనుండటంతో మరోసారి కేరళ రంజీలో దర్శనమివ్వనున్నారు.


logo