శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 00:35:28

సైనికులకు సెల్యూట్‌

సైనికులకు సెల్యూట్‌

  •  కార్గిల్‌ దివస్‌ సందర్భంగా క్రీడాలోకం నివాళులు 

న్యూఢిల్లీ: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. శత్రు సేనలను చీల్చిచెండాడి కార్గిల్‌ కొండలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత సైన్యానికి క్రీడాలోకం సలాం చేసింది. కార్గిల్‌ యుద్ధం జరిగి ఆదివారానికి 21 ఏండ్లు పూర్తైన సందర్భంగా.. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌'ను పురస్కరించుకొని మన వీర సైనికుల సేవలను టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొనియాడారు. ‘దేశ ప్రజల రక్షణకై ప్రాణత్యాగాలు  చేసిన అమర జవాన్లకు సెల్యూట్‌' అని విరాట్‌ ట్వీట్‌ చేయగా.. ‘కార్గిల్‌లో మన సైన్యం చూపిన ధైర్యసాహసాలు అసమానమైనవి. వారి త్యాగాలను వెలకట్టలేం’ అని టెండూల్కర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. హైదరాబాదీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, టీమ్‌ఇండియా క్రికెటర్లు లోకేశ్‌ రాహుల్‌, అజింక్యా రహానే.. షూటర్లు గగన్‌ నారంగ్‌, మను భాకర్‌, మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌, దీపా మాలిక్‌ తదితరులు కార్గిల్‌ దివస్‌ సందర్భంగా అమర సైనికులకు నివాళులు అర్పించారు. logo