సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 10, 2020 , 10:45:55

క్రీడాస్ఫూర్తిని మరిచారు..

క్రీడాస్ఫూర్తిని మరిచారు..

దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ నిన్నటితో ముగిసింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. ఫైనల్లో డిపెండిండ్‌ చాంపియన్‌ ఇండియాను డక్‌వర్త్‌లూయిస్‌ పద్దతిలో 3 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా, బంగ్లా బ్యాట్స్‌మెన్‌ రకీబుల్‌ హసన్‌ సింగిల్‌తో జట్టుకు విజయం సాధించిపెట్టాడు. విజయానంతరం, బంగ్లా ఆటగాళ్లు గ్యాలరీ నుంచి ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చారు. ఇండియా ఆటగాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట జరిగింది. ముఖ్యంగా బంగ్లా ఆటగాళ్లు.. క్రీడాస్ఫూర్తిని పూర్తిగా మరిచారు. విజయానంతరం, ప్రత్యర్థి జట్టుకు  కనీసం కరచాలనం కూడా ఇవ్వకుండా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో, ఓ భారత క్రికెటర్‌ కూడా వారితో వాదనకు దిగాడు. పరిస్థితిని గమనించిన అంపైర్లు ఇరు జట్ల ఆటగాళ్లను దూరంగా పంపించారు. 

మ్యాచ్‌ ప్రజెంటేషన్‌ సమయంలో వ్యాఖ్యాత.. బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీని ఈ ఘటనపై వివరణ కోరాడు. దీనికి బదులుగా అక్బర్‌.. ఈ ఘటన పట్ల చింతిస్తున్నానని తెలిపాడు. ఆవేశంలో కుర్రాళ్లు అలా ప్రవర్తించారనీ, వారి ప్రవర్తనకు తాను జట్టు తరఫున క్షమాపణ చెబుతున్నానన్నాడు. క్రితం సారి ఆసియాకప్‌ ఫైనల్లో ఇండియా చేతిలో ఓడినందుకు వారు అలా ప్రవర్తించి ఉంటారని అక్బర్‌ తెలిపాడు. ఏదేమైనా మా ఆటగాళ్ల ప్రవర్తన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనీ.. దీని పట్ల మరోసారి క్షమాపణ చెబుతున్నట్లు అతడు తెలిపాడు. 

భారత కెప్టెన్‌ ప్రియంగార్గ్‌ మాట్లాడుతూ.. ఇది చాలా హేయమైన ఘటన. ఇలాంటి సన్నివేశాలు మేజర్‌ టోర్నీల్లో తానెప్పుడూ చూడలేదని ప్రియం తెలిపాడు. బంగ్లా ఆటగాళ్లు.. మ్యాచ్‌ ప్రారంభం నుంచే తమ జట్టు ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని అతను ఆవేదనగా మాట్లాడాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం వారి ప్రవర్తన మరీ ఘోరంగా ఉందని అతడు తెలిపాడు. ఆటలో గెలుపోటములు సహజమని తెలిపిన భారత కెప్టెన్‌.. ఇలాంటి ఘటన ఫైనల్లో జరగడం దారుణమన్నాడు. 

కాగా, బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల ప్రవర్తనపై నెటిజన్స్‌ విమర్శలు చేస్తున్నారు. ఒక్కసారి టైటిల్‌ గెలిచినంత మాత్రాన ఇలా ప్రవర్తించడం బంగ్లా ఆటగాళ్లకు తగదని వారు పోస్టు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు క్రీడలకే సిగ్గు చేటని వారు విమర్శిస్తున్నారు. అండర్‌-19 వరల్డ్‌కప్‌ను భారత్‌ అత్యధికంగా 4 సార్లు గెలుచుకోగా, ఆస్ట్రేలియా 3 సార్లు గెలుచుకుంది. తొలిసారి ఫైనల్‌ చేరిన బంగ్లా.. టైటిల్‌ ఎగరేసుకుపోయింది. 


logo