శనివారం 08 ఆగస్టు 2020
Sports - Aug 02, 2020 , 01:51:33

రాష్ట్రంలో క్రీడల పునరుద్ధరణ

 రాష్ట్రంలో క్రీడల పునరుద్ధరణ

  • l 5 నుంచి స్టేడియాలు, యోగా, జిమ్‌ సెంటర్లు ప్రారంభం 
  • l స్పోర్ట్స్‌ పాలసీపై    మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో క్రీడల పునరుద్ధరణ జరుగబోతున్నది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్‌-19మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈనెల 5 నుంచి స్టేడియాలు, యోగా, జిమ్‌ సెంటర్లు ప్రారంభమవుతాయని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో కరోనా వైరస్‌ నిబంధనలు, స్పోర్ట్స్‌ పాలసీపై ప్రముఖ క్రీడాకారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ  స్టేడియాల్లో క్రీడాకారులు తగు జాగ్రత్తలతో ప్రాక్టీస్‌ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎలాంటి క్రీడా టోర్నీల నిర్వహణకు అనుమతి లేదన్నారు. మెరుగైన క్రీడా పాలసీ, స్పోర్ట్స్‌ సిటీ కోసం సీఎం కేసీఆర్‌.. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించేందుకు మంత్రి కేటీఆర్‌ సహకారంతో కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌(టీవోఏ) అధ్యక్షుడు జయేశ్‌ రంజన్‌, సాట్స్‌ ఎండీ శ్రీనివాస్‌ రాజు, హెచ్‌సీఏ చీఫ్‌ అజారుద్దీన్‌, సానియా మీర్జా, షట్లర్లు సిక్కి రెడ్డి, సుమిత్‌ రెడ్డి, సాయి ప్రణీత్‌, జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ రమేశ్‌, రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo