బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Sep 05, 2020 , 01:53:58

స్టేడియాల్లోకి ప్రేక్షకులు ఎప్పుడొస్తారో: కిరణ్‌ రిజిజు

స్టేడియాల్లోకి ప్రేక్షకులు ఎప్పుడొస్తారో: కిరణ్‌ రిజిజు

న్యూఢిల్లీ: స్టేడియాల్లోకి ప్రేక్షకులు ఎప్పుడు వచ్చేది తెలియదని, దానికంటూ నిర్ణీత కాల పరిమితి లేదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్‌ 4 మార్గదర్శకాల్లో ఈనెల 21 నుంచి 100 మందికి మించకుండా టోర్నీలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. ఫుట్‌బాల్‌ దిగ్గజం బైచుంగ్‌ భూటియా ఫుట్‌బాల్‌ స్కూల్‌ ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌ విడుదల ఆన్‌లైన్‌ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ ‘స్టేడియాల్లోకి ప్రేక్షకుల ప్రవేశంపై ఇప్పుడే నేనేమి చెప్పలేను. రానున్న ఒకటి, రెండు నెలల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయలేను. కానీ  త్వరలో స్టేడియాల్లో ప్రేక్షకులు వస్తారన్న నమ్మకముంది. ఏదైనా ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం. ఈనెల 21 నుంచి క్రీడా టోర్నీలు మొదలవుతున్నందున అందరూ జాగ్రత్తలు పాటించాలి. మాస్క్‌లు ధరించడంతో పాటు నిర్ణీత దూరం, శానిటైజర్‌ వాడాలి. 2028 ఒలింపిక్స్‌లో టాప్‌-10 లక్ష్యంగా జూనియర్‌ టాప్స్‌ స్కీమ్‌ను తీసుకొచ్చాం. ప్రపంచ చాంపియన్‌ను తయారు చేసేందుకు ఎనిమిదేండ్ల సమయం పడుతుంది. పేదరికం అనుభవిస్తున్న మాజీ అథ్లెట్లకు అండగా నిలుస్తాం’ అని అన్నారు. 


logo