అవిశ్రాంత గురువు

రిటైర్మెంట్ తర్వాత కూడా విరామం లేకుండా వీరారెడ్డి కృషి
రిటైర్మెంట్ ఉద్యోగానికే.. సంకల్పానికి కాదంటూ ఆ గురువు ముందుకు సాగుతున్నారు. ఆరు పదుల వయసులోనూ విద్యార్థులు, యువత కోసం శ్రమిస్తున్నారు. రోజూ 4 గంటల పాటు పిల్లలకు వాలీబాల్లో శిక్షణ ఇచ్చి మెరికల్లా తయారు చేస్తున్నారు. జాతీయ, రాష్టస్థాయిల్లో సత్తాచాటేలా ఆణిముత్యాలను తయారు చేస్తున్నారు. తనకు జీతం రాకపోయినా పిల్లల బంగారు జీవితాల కోసం కృషి చేస్తున్న ఆయనే ప్రభుత్వ రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు నెలకుర్తి వీరారెడ్డి. పుట్టిపెరిగిన జయపురం గ్రామానికి అవిశ్రాంత సేవ చేస్తున్న పీఈటీ సార్పై ప్రత్యేక కథనం..
నర్సింహులపేట, ఫిబ్రవరి 6: విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు నెలకుర్తి వీరారెడ్డి ముందుకు సాగుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన వీరారెడ్డికి బాల్యం నుంచి క్రీడలంటే అసక్తి. ఆ పట్టుదలే ఆయనను వ్యాయమ ఉపాధ్యాయుడిని చేసింది. సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ద్వారా ఉద్యోగం పొంది 1983లో అదిలాబాద్ జిల్లా రామకృష్ణాపురం పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడిగా వీరారెడ్డి తొలుత బాధ్యతలు చేపట్టారు. ఆయన శిక్షణ ఇచ్చిన జట్టు.. భారత క్రీడా ప్రాధికార సంస్థ బెంగళూరులో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి పనిచేసిన ప్రతి పాఠశాలలో ఎంతో మందిని ఆయన వాలీబాల్ ప్లేయర్లుగా తీర్చిదిద్దారు. ఆయన వద్ద వాలీబాల్ పాఠాలు నేర్చుకున్న పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. చివరగా ఖమ్మం జిల్లా ఇల్లందులో పనిచేసి 2014లో వీరారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. తర్వాత సొంత ఊరైన జయపురానికి వచ్చి అలుపెరుగకుండా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
రోజూ శిక్షణ.. వేసవిలో క్యాంపులు
విద్యార్థుల్లో ఉండే ప్రతిభకు మెరుగుదిద్దడంలో వీరారెడ్డి ప్రావీణ్యులు. ఇలా ఎంతో మంది విద్యార్థులను ఆయన వాలీబాల్ క్రీడాకారులను చేసి వారి బంగారు భవితకు బాటలు వేశారు. ప్రతి రోజూ విద్యార్థులకు నాలుగు గంటల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తూ జాతీయ, రాష్ట్రస్థాయిల్లో సత్తాచాటేలా తీర్చిదిద్దారు. ప్రతి వేసవి కాలంలో క్యాంపులను సైతం నిర్వహిస్తున్నారు. ఆరు పదుల వయసు దాటినా వేడికి ఏ మాత్రం భయపడని వీరారెడ్డి చురుకుగా విద్యార్థుల కోసం కష్టపడుతున్నారు. వీరారెడ్డి దగ్గర శిక్షణ పొందుతున్న చందు లావణ్య అనే విద్యార్థిని అండర్-13, 14 విభాగంలో తెలంగాణ జట్టు తరఫున మధ్యప్రదేశ్లో జరిగిన వాలీబాల్ జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటింది. రాజస్థాన్లో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లోనూ రాణించింది.
మా అదృష్టం
వీరారెడ్డి సార్ వాలీబాల్లో అన్ని మెళకువలు నేర్పిస్తున్నారు. ఆయన వల్ల క్రీడల్లో రాణిస్తున్నా. జాతీయస్థాయిలో పోటీల్లో పాల్గొన్నా. ఇలాంటి గురువు దొరకడం మా అదృష్టం.
- చందు లావణ్య, జాతీయ స్థాయి క్రీడాకారిణి
క్రీడలపై ఆసక్తి కలిగింది
రోజూ వాలీబాల్ ఆడుతుండడం వల్ల శారీరకంగా ఉల్లాసంగా ఉంది. వీరారెడ్డి సార్ వల్ల క్రీడలపై ఆసక్తి పెరిగింది. సెలవులు వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటున్నాం.
- మందుల శృతి, విద్యార్థిని
పిల్లలు ప్రయోజకులైతే చాలు
సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు వచ్చిన వాలీబాల్ క్రీడను విద్యార్థులకు, యువతకు నేర్పిస్తున్నా. ఆటలో మెరుగయ్యేలా, ఎలాంటి తప్పులు చేయకుండా వారికి అన్ని మెళకువలను బోధిస్తున్నా. వాలీబాల్లో సత్తాచాటేలా ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తున్నా. నా వల్ల విద్యార్థులు ప్రయోజకులైతే చాలు.
- నెలకుర్తి వీరారెడ్డి, రిటైర్డ్ పీఈటీ