ఆదివారం 01 నవంబర్ 2020
Sports - Sep 29, 2020 , 02:25:32

ఏ ఆటగాడితోనైనా మాట్లాడుతా: గంగూలీ

ఏ ఆటగాడితోనైనా మాట్లాడుతా: గంగూలీ

కోల్‌కతా: దాదాపు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన తాను ఏ ఆటగాడితోనైనా మాట్లాడుతానని అది శ్రేయాస్‌ అయ్యర్‌ అయినా, కోహ్లీ అయినా ఒక్కటేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఐపీఎల్‌ టోర్నీకి ముందు ఒక ప్రైవేట్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో మంగళవారం ప్రమోషన్‌ ఈవెంటులో పాల్గొన్న దాదా మీడియాతో మాట్లాడాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలోకి తనను లాగడంపై దాదా తనదైన రీతిలో స్పందించాడు. ‘అవును గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా కెప్టెన్‌ అయ్యర్‌కు అండగా నిలిచాను. ఇప్పుడు నేను బీసీసీఐ అధ్యక్షునిగా ఉండవచ్చు, కానీ భారత్‌ తరఫున దాదాపు 500 మ్యాచ్‌లాడిన అనుభవాన్ని మరిచిపోకండి. ఏ యువ క్రికెటర్‌తోనైనా నా అనుభవాన్ని పంచుకొంటాను. అయ్యర్‌, కోహ్లీ ఎవరైనా మంచిదే.. సహాయం కావాలని అడిగితే మద్దతుగా నిలుస్తాను’ అని అన్నాడు. మరోవైపు వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు దేశవాళీ సీజన్‌ను స్వదేశంలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని గంగూలీ అన్నాడు.