శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 16:53:08

విశ్వవిజేత ఆస్ట్రేలియా..వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి

విశ్వవిజేత ఆస్ట్రేలియా..వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి

మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ఐదోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

మెల్‌బోర్న్‌: మహిళా క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరైన ప్రపంచకప్‌-2020 తుది సమరంలో ఆస్ట్రేలియా జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. వరుసగా విజయాలు సాధించి మొదటి సారి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత అమ్మాయిల జట్టు రన్నరప్‌గా నిలిచింది. టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఫైనల్‌ పోరులో అడుగుపెట్టిన భారత్‌ ఒత్తిడిలో అన్ని రంగాల్లో విఫలమై కప్పును చేజార్చుకుంది.  ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు 86,174 మంది అభిమానులు హాజరవడం విశేషం.

సొంత గడ్డపై ఆరంభం నుంచి ప్రశాంతంగా, ఉత్సాహంగా కనిపించిన ఆసీస్‌ ఐదోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. తొలిసారి విశ్వకిరీటం సొంతం చేసుకోవాలనుకున్న మన అమ్మాయిల కలనెరవేరలేదు.  ఫైనల్‌ సమరం హోరాహోరీగా సాగుతుందని అభిమానులు భావించగా పోరు ఏకపక్షమే అయింది. 185  పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.


ఆ ఇద్దరిదే హవా..

ప్రపంచకప్‌ తుదిపోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు అలీసా హీలీ(75 39 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), బెత్‌ మూనీ(78 నాటౌట్‌: 54 బంతుల్లో 10ఫోర్లు) మెరుపు హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు.  ఆసీస్ భారీ స్కోర్‌లో కీలక పాత్ర పోషించింది వీరిద్దరే. ఈ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించింది.  భారత పేస్‌ విభాగం బలహీనంగా ఉండటంతో ఆసీస్‌ ఓపెనర్లు రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు. ఏ ఒక్క బౌలర్‌ కూడా ఓపెనింగ్‌ ద్వయాన్ని అడ్డుకోలేకపోయింది.


టాప్‌ ఆర్డర్‌ టపటపా..!

ఆస్ట్రేలియా నిర్దేశించిన 185  పరుగుల లక్ష్య ఛేదనలో  భారత జట్టు స్వల్ప స్కోరుకే ప్రధాన వికెట్లు చేజార్చుకుంది. మెగాన్‌ షట్‌ తొలి ఓవర్‌ మూడో బంతికే యువ సంచలనం షఫాలీ వర్మను ఔట్‌ చేసి భారత్‌ పతనాన్ని ఆరంభించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో భారత అమ్మాయిలు పెవిలియన్‌ బాటపట్టారు. జట్టు స్కోరు 8 వద్ద జెమీమా రోడ్రిగ్స్‌ వెనుదిరగ్గా.. స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధాన ఔటైంది. ఈ దశలో ఆచితూచి ఆడాల్సిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ నాలుగో వికెట్‌ రూపంలో ఔటవడంతో కప్పుపై భారత్‌ ఆశలు వదులుకుంది.  టోర్నీలో ఎక్కువగా షఫాలీపైనే ఆధారపడిన భారత అమ్మాయిలు..పటిష్ఠ ఆసీస్‌ బౌలింగ్‌  దెబ్బకు టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. దీప్తి శర్మ(38) టాప్‌ స్కోరర్‌. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. ఆసీస్‌ బౌలర్లలో మెగాన్‌ షట్‌, జొనాసెన్‌ చెరో మూడు వికెట్లతో చెలరేగారు.  


బడ్జెట్‌ 2020.. అన్ని వార్తలు ఒకే దగ్గరlogo