శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 11:11:19

ఇండియా టూర్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. డుప్లెసిస్‌ పునరాగమనం

ఇండియా టూర్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. డుప్లెసిస్‌ పునరాగమనం

హైదరాబాద్‌: త్వరలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు ఇండియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రొటీస్‌ జట్టు.. ఇండియాతో మూడు వన్డేలు ఆడనుంది. మార్చి 12 నుంచి ప్రారంభవనున్న తొలి వన్డేతో సిరీస్‌ ప్రారంభమవుతుంది. కాగా, ఈ సిరీస్‌కు సంబంధించి క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు జాబితా ప్రకటించింది. ఈ సిరీస్‌తో మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ పునరాగమనం చేయనున్నాడు. అతనితో పాటు రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ కూడా ఇండియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికవ్వలేదు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ జార్జ్‌ లిండే.. ఇండియాతో జరిగే వన్డే సిరీస్‌తో వన్డేల్లో ఆరంగేట్రం చేయనున్నాడు. 

మొదటి మ్యాచ్‌ 12న ధర్మశాలలో జరగనుండగా.. రెండో మ్యాచ్‌ 15న లక్నోలో, మూడో మ్యాచ్‌ 18న కలకత్తాలో జరగనున్నది. కాగా, డుప్లెసి రాకతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలపడుతుందనడంలో సందేహం లేదు. పేస్‌ బౌలర్‌ కాగిసో రబాడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 

భారత్‌లో.. ఆతిథ్య జట్టును ఎదుర్కోవడం చాలా కష్టం. భారత్‌ చాలా పటిష్టమైన జట్టు. మా జట్టు కూడా అన్ని  విభాగాల్లో సమతూకంగా ఉంది. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తామని జట్టు సెలక్టర్‌ లిండా జోండి అన్నారు. 

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్‌ డీ కాక్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా, రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, కైల్‌ వెర్రైన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, జోన్‌-జోన్‌ స్ముట్స్‌, ఫెలిక్వాయో, లుంగి ఎంగిడి, లుతో సిపమ్లా, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, ఆన్రిచ్‌ నార్ట్‌జే, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌. 


logo