గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 00:14:56

కెప్టెన్సీకి డుప్లెసిస్‌ వీడ్కోలు

 కెప్టెన్సీకి డుప్లెసిస్‌ వీడ్కోలు

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కొత్త తరం నాయకుల చేతుల్లో దేశ క్రికెట్‌ సురక్షితంగా ఉంటుందని భావించిన డుప్లెసిస్‌ సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 2017లో ఏబీ డివిలియర్స్‌ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న ఫాఫ్‌ రెండేండ్ల పాటు మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్‌గా తప్పుకున్నా.. సీనియర్‌ ఆటగాడిగా కెప్టెన్‌, కోచ్‌లకు సహాయసహకారాలు అందిస్తానని అతడు పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్న 35 ఏండ్ల డుప్లెసిస్‌.. తాజాగా తన మనసులో మాట బయట పెట్టాడు.


‘కొత్త నాయకత్వంలో యువ ఆటగాళ్లు సరైన మార్గంలో పయనిస్తున్నప్పుడు అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిదని భావిస్తున్నా. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఎక్కువ రోజులు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేకపోవచ్చు. దేశానికి నాయకత్వం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇది చాలా కఠిన నిర్ణయమే కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా’ అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.


logo