శనివారం 11 జూలై 2020
Sports - Jun 13, 2020 , 16:56:47

'భారత్‌పై మాట్లాడితే అది గంగూలీ గురించే అవుతుంది'

'భారత్‌పై మాట్లాడితే అది గంగూలీ గురించే అవుతుంది'

లాహోర్‌:  టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ కెప్టెన్సీపై  పాకిస్థాన్‌ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసలు కురిపించాడు. గంగూలీ భయమెరుగని బ్యాట్స్‌మన్‌ అని, జట్టును సిద్ధం చేయడంలో అతడే అత్యుత్తమని  కొనియాడాడు. తాను చూసిన భారత కెప్టెన్లలో గంగూలీ అత్యుత్తమ సారథి అని ప్రశంసించాడు. 

'ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి గంగూలీ భయపడేవాడని, అందులోనూ నా బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బందిపడ్డాడని చాలా మంది అనుకుంటారు. కానీ, అది వాస్తవం కాదు. గంగూలీ  ధైర్యవంతమైన బ్యాట్స్‌మన్‌. కొత్త బంతితో నన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల ఏకైక ఓపెనర్‌ దాదానేనని' హలో యాప్‌తో ఇంటర్వ్యూలో అక్తర్‌ తెలిపాడు.

'గంగూలీ ఛాతీ మీదకు బంతులేస్తూ చాలా సార్లు అతన్ని టార్గెట్‌ చేశాను. కానీ, అతను ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అయినప్పటికీ పరుగులు సాధించాడు. అందుకే గంగూలీ ధైర్యవంతమైన బ్యాట్స్‌మన్‌ అని నేను ఎప్పుడూ చెబుతుంటానని' షొయబ్‌ చెప్పాడు.  

'నేను భారత్‌ గురించి మాట్లాడితే, అది కచ్చితంగా గంగూలీ గురించే అవుతుంది.  అతనికన్నా బెస్ట్‌ కెప్టెన్‌ను ఇండియా తయారుచేయలేకపోయింది. ధోనీ చాలా మంచి ఆటగాడు. అతను కూడా అద్భుతమైన కెప్టెనే. కానీ, జట్టు నిర్మాణం విషయంలో దాదా గొప్పగా పనిచేశాడని' అక్తర్‌ వివరించాడు.


logo