శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 22:28:21

జనవరి నుంచి దేశవాళి క్రికెట్‌ సీజన్‌

జనవరి నుంచి దేశవాళి క్రికెట్‌ సీజన్‌

దుబాయ్‌ : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశవాళి క్రికెట్ సీజన్ జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం వెల్లడించారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శనివారం సాయంత్రం సమావేశమైంది. భారతదేశంలో పెరుగుతున్న కొవిడ్‌-19 కేసుల వల్ల గందరగోళంలో పడిన దేశీయ క్రికెట్‌ క్యాలెండర్ గురించి ఎక్కువ సమయం చర్చించారు.

"బీసీసీఐ సమావేశంలో దేశీయ క్రికెట్‌పై విస్తృతమైన చర్చలు జరిపాం. వచ్చే జనవరి 1 నుంచి పోటీలను నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించాం" అని గంగూలీ తెలిపారు. అన్ని దేశీయ టోర్నమెంట్లను ఆచరణాత్మక ప్రయోజనాల కోసం బోర్డు అనుమతించదు అని చెప్పారు. ఖచ్చితంగా పూర్తి స్థాయి రంజీ ట్రోఫీ రెడ్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని, రంజీ ట్రోఫీ కోసం జనవరి-మార్చి నెలల్లో నిర్వహణకు బీసీసీఐ దృష్టి సారిస్తున్నదని చెప్పిన గంగూలీ.. అన్ని టోర్నమెంట్లను నిర్వహించడం బహుశా సాధ్యం కాకపోవచ్చన్నారు. జూనియర్ క్రికెట్, మహిళల టోర్నమెంట్లు మార్చి-ఏప్రిల్ మధ్య జరుగుతాయని చెప్పారు.

నిర్బంధ దశలో భారత జట్టును ఆస్ట్రేలియాలో శిక్షణ ఇవ్వడానికి అనుమతించనున్నట్లు గంగూలీ తెలిపారు. ఆస్ట్రేలియాతో భారత్‌ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20, నాలుగు టెస్టులు ఆడనున్నది. ఇంగ్లండ్‌తో జరుగనున్న స్వదేశీ సిరీస్‌ గురించి బీసీసీఐ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని, తుది ప్రయాణాన్ని నిర్ణీత సమయంలో సిద్ధం చేస్తామని చెప్పారు. భారతదేశంలో అహ్మదాబాద్, కోల్‌కతా, ధర్మశాల వేదికలు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యూఏఈ రెండవ ఆప్షన్‌గా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.