గురువారం 22 అక్టోబర్ 2020
Sports - Jun 12, 2020 , 02:29:57

ఐపీఎల్‌ పై ఆశలు

ఐపీఎల్‌ పై ఆశలు

  • లీగ్‌ కోసం సిద్ధమవుతున్న బీసీసీఐ.. సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరిగే అవకాశం

 టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించకున్నా.. సమావేశం ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ తన వైఖరి స్పష్టం చేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించే ఆలోచనల్లో ఉన్నామని.. అవసరమైతే ఖాళీ మైదానాల్లోనైనా మ్యాచ్‌లు జరుపుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. దేశవాళీ సీజన్‌పై కూడా దృష్టిపెట్టామని.. మరో రెండు వారాల్లో కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నాడు.

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా క్రీడాలోకం స్తంభించిపోయిన కష్టకాలంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ క్రికెట్‌ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ నిర్వహించే ఆలోచన ఉందని.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధమవుతున్నదని ప్రకటించాడు. అవసరమైతే ప్రేక్షకులను అనుమతించకుండా మ్యాచ్‌లు నిర్వహించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకునేందుకు బుధవారం సమావేశమైన ఐసీసీ.. మెగాటోర్నీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునేది లేదు.. వచ్చే నెలలో ప్రకటిస్తామని చేతులు దులుపుకుంది. ఈ ఆన్‌లైన్‌ సమావేశంలో పాల్గొన్న దాదా.. మరుసటి రోజే బోర్డు సభ్యులకు లేఖ రాయడం చూస్తుంటే.. ఐసీసీలో మరోసారి బీసీసీఐ మాట నెగ్గిందనే విషయం స్పష్టమౌతున్నది.

అక్టోబర్‌లో ఐపీఎల్‌!

కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ర్టాల క్రికెట్‌ సంఘాలకు బీసీసీఐ స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసిజర్‌ పేరిట కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది మార్చి 29న ప్రారంభమవ్వాల్సిన ఐపీఎల్‌ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ ఖాళీలో ఐపీఎల్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయనే వాదనలకు.. గంగూలీ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. బుధవారం జరిగిన ఐసీసీ సమావేశంలో ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే పొట్టి ప్రపంచకప్‌పై ఐసీసీ తుది నిర్ణయం ప్రకటించకముందే బీసీసీఐ తమ కార్యాచరణ రూపొందించుకోవడం గమనార్హం.

సానుకూలంగా ఉన్నాం: దాదా


‘ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నది. అవసరమైతే ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఐపీఎల్‌ సీజన్‌ కోసం అభిమానులు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు, మిగతా భాగస్వాములు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన ప్లేయర్స్‌తో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా లీగ్‌పై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఏడాది టోర్నీ నిర్వహించేందుకు బోర్డు సానుకూలంగా ఉంది. త్వరలో భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తాం. దేశవాళీ క్రికెట్‌ సీజన్‌పై కూడా బీసీసీఐ దృష్టి సారించింది. రంజీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, విజయ్‌ హజారే వంటి టోర్నీలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని దాదా పేర్కొన్నాడు. 

ఐపీఎల్‌ ఖాయమే: బ్రిజేష్‌

ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ఈ ఏడాది లీగ్‌ జరగడం పక్కా అని అంటున్నాడు. ‘ఐపీఎల్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేస్తే దాన్ని బట్టి లీగ్‌ను షెడ్యూల్‌ చేస్తాం. త్వరలోనే ప్రకటన వస్తే పనులు ప్రారంభించొచ్చు. సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్య ఐపీఎల్‌ 13వ సీజన్‌ జరగడం ఖాయమే’ అని బ్రిజేష్‌ అన్నాడు. అక్టోబర్‌ వరకు పరిస్థితుల్లో మార్పువస్తుందని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.logo