శనివారం 04 జూలై 2020
Sports - Apr 09, 2020 , 21:11:37

కోహ్లీతో పెట్టుకుంటే.. ప్ర‌త్య‌ర్థికే క‌ష్టం: ర‌షీద్ ల‌తీఫ్‌

కోహ్లీతో పెట్టుకుంటే.. ప్ర‌త్య‌ర్థికే క‌ష్టం: ర‌షీద్ ల‌తీఫ్‌

లాహోర్‌: మైదానంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలాంటి ఆట‌గాళ్ల జోలికి వెళ్ల‌కుండా ఉండ‌ట‌మే ఉత్త‌మ‌మ‌ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్ సూచించాడు. కోహ్లీ క్రీజులో ఉన్న‌ప్పుడు అత‌డిని మాట‌ల‌తో ఉడికిస్తే.. అది బౌలింగ్ టీమ్‌కే ఇబ్బంద‌ని ల‌తీఫ్ పేర్కొన్నాడు. గురువారం యూట్యూబ్ వీడియోలో ఈ అంశంపై మాట్లాడిన ల‌తీఫ్‌.. `2014 ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు టెస్టులు ముగిసిన త‌ర్వాత మ‌హేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. ఆ స‌మ‌యంలో జ‌ట్టు ప‌గ్గాలు చేబ‌ట్టిన విరాట్‌.. నాలుగో టెస్టులో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. వాస్త‌వానికి ఆ సిరీస్ మొత్తం కంగారూ పేస‌ర్లు కోహ్లీని రెచ్చ‌గొడుతూ వ‌చ్చారు. ఇక చివ‌రి టెస్టుకు వ‌చ్చేవ‌ర‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అందుకున్న కోహ్లీని ఆసీస్ బౌల‌ర్లు ప‌దేప‌దే మాట‌ల‌తో ఉడికించారు. ముఖ్యంగా జాన్స‌న్ అయితే ఒక అడుగు ముందుకేసి మ‌రీ విరాట్‌ను రెచ్చ‌గొట్టాడు. దానికి కోహ్లీ ఏమాత్రం టెన్ష‌న్ ప‌డ‌కుండా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచ‌రీలు బాద‌డంతో పాటు నోటితోనూ కంగారూల‌కు దీటుగా బ‌దులిచ్చాడు` అని పేర్కొన్నాడు. 

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొంద‌రు ఆట‌గాళ్ల‌తో పెట్టుకోక‌పోవ‌డమే మంచిద‌ని ల‌తీఫ్ చెప్పుకొచ్చాడు. `మైదానంలో కొంత‌మంది ఆట‌గాళ్ల‌తో ఎప్ప‌టికీ పెట్టుకోవ‌ద్దు. మా జ‌ట్టు నుంచి జావేద్ మియాందాద్ భాయ్‌, వివ్ రిచ‌ర్డ్స్‌, సునీల్ గవాస్క‌ర్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ జాబితాలో ఉన్నారు` అని పాక్ మాజీ కెప్టెన్ అన్నాడు. ఇటీవ‌ల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సంద‌ర్భంగానూ విరాట్.. క‌రీబియ‌న్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడ‌ని ల‌తీఫ్ గుర్తుచేశాడు.


logo