సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 01, 2020 , 23:24:51

క్వీన్‌..కెనిన్‌

క్వీన్‌..కెనిన్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ నయా చాంపియన్‌గా అమెరికా యువ స్టార్‌ సోఫియా కెనిన్‌ అవతరించింది. టోర్నీలో సంచలన విజయాలతోదూసుకొచ్చిన సోఫియా ఫైనల్లోనూ అదరగొట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌ ముగురుజనుచిత్తుచేసి మొదటిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ముద్దాడింది. తొలిసెట్‌ కోల్పోయినా ఆ తర్వాత కెనిన్‌ పుంజుకున్న తీరు అద్భుతమనిపించింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జొకోవిచ్‌ థీమ్‌ తలపడనున్నారు.

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నయా చాంపియన్‌ సోఫియా
  • ఫైనల్లో ముగురుజపై గెలుపు
  • నేడు పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌
  • జొకోవిచ్‌ xథీమ్‌
  • మధ్యాహ్నం 2గంటల నుంచి సోనీ సిక్స్‌లో.
  • ప్రైజ్‌ మనీవిజేతకు: 20.11 కోట్లు
  • రన్నరప్‌నకు: 10.8 కోట్లు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన అమెరికా యువ తార సోఫియా కెనిన్‌ అద్భుతం చేసింది. సెమీస్‌లో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీని మట్టికరిపించిన జోరులోనే ఫైనల్లో ముగురుజను చిత్తుచేసి మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2008లో షరపోవా తర్వాత ఈ టైటిల్‌ అందుకున్న పిన్నవయస్కురాలిగా 21ఏండ్ల కెనిన్‌ రికార్డు సృష్టించింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన తొలిసారే టైటిల్‌ సాధించింది.  శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ తుదిపోరులో 14వ సీడ్‌ సోఫియా 4-6, 6-2, 6-2తేడాతో ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌, అన్‌సీడెడ్‌ గాబ్రిన్‌ ముగురుజ(స్పెయిన్‌)ను ఓడించి నూతన చాంప్‌గా అవతరించింది. మ్యాచ్‌ తొలిసెట్లో వింబుల్డన్‌ మాజీ విజేత ముగురుజ దూకుడు ప్రదర్శించి 3-1తో ముందంజ వేసింది. బలమైన షాట్లతో కెనిన్‌ను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టింది. ఆ తర్వాత కూడా అదే కనబరిచి రెండుసార్లు సోఫియా సర్వీస్‌లు బ్రేక్‌ చేసి 6-4తో తొలిసెట్‌ కైవసం చేసుకుంది. ఆ తర్వాత కెనిన్‌ విజృంభణ ప్రారంభమైంది. రెండో సెట్‌ తొలి గేమ్‌లోనే ప్రత్యర్థికి ఒక్కపాయింట్‌ కూడా ఇవ్వని సోఫియా ఆ తర్వాత మరింత రెచ్చిపోయింది.


నా కల సాకారమైంది. ఈ ఆనందాన్ని వర్ణించలేకున్నా. ఇది నిజంగా అద్భుతం. మీకు కలలుంటే కష్టపడండి. కచ్చితంగా నెరవేరుతాయి. ఈ రెండు వారాలు నా జీవితంలో  అత్యుత్తుమైన రోజులు

  సోఫియా కెనిన్‌ 

 కీలకమైన సమయాల్లో పాయింట్ల సాధిస్తూ రెండుసార్లు ముగురుజ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి రెండో సెట్‌ను 6-2తో దక్కించుకుంది. నిర్ణయాత్మక సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు హోరాహోరీగా ఆడడంతో లాంగ్‌ర్యాలీలు అభిమానులను అలరించాయి. అయితే కీలక సమయాల్లో పైచేయి సాధిస్తూ ముందుకు సాగిన సోఫియా జోరు పెంచింది. 3-2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో స్పెయిన్‌ ప్లేయర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ముందంజ వేసింది. చివరి గేమ్‌లోనూ ముగురుజ సర్వీస్‌లో సోఫియా రెచ్చిపోయింది. చివర్లో అడ్వాంటేజ్‌ పాయింట్‌ వద్ద ఇద్దరు ప్లేయర్ల మధ్య లాంగ్‌ర్యాలీ జరిగినా చివరికి సోఫియా దూకుడు కనబరిచి 6-4తో సెట్‌ను కైవసం చేసుకుంది. కిలిమంజారో అధిరోహించిన ముగురుజపై గెలిచి కెనిన్‌ విజేతగా నిలిచింది. కోర్టులోనే ఆనంద బాష్పాలతో అభివాదం చేస్తూ భావోద్వేగానికి లోనైంది.  మ్యాచ్‌ మొత్తంలో సోఫియా ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ చేయలేదు. కాగా ఎనిమిది డబుల్‌ ఫాల్ట్‌లతో కీలక సమయాల్లో పాయింట్లు కోల్పోయిన మాజీ నంబర్‌ వన్‌ ముగురుజ మూల్యం చెల్లించుకుంది. ఈ విజయంతో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను వెనక్కి నెట్టి.. అమెరికా నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా సోఫియా నిలిచింది. 


జొకోతో థీమ్‌ ఢీ 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరు ఆదివారం జరుగనుంది. ఈ టోర్నీ తుదిపోరులో అడుగుపెట్టిన ఏడుసార్లూ విజేతగా నిలిచిన డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌తో.. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో ఉన్న ఐదో సీడ్‌ థీమ్‌ తలపడనున్నాడు. పదేండ్లలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మూడుసార్లు మాత్రమే సెర్బియా స్టార్‌ జొకో ఓటమి పాలయ్యాడు. ఈసారి కూడా టైటిల్‌ సాధించి గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్యను 17కు పెంచుకొని నాదల్‌(19), రోజర్‌ ఫెదరర్‌(20)కు మరింత చేరువవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌ గెలిస్తే గతేడాది చేజారిన ప్రపంచ అగ్రర్యాంకును నొవాక్‌ మరోసారి సాధిస్తాడు. మరోవైపు డొమెనిక్‌ థీమ్‌(ఆస్ట్రియా) సైతం దూకుడైన ఆటతో సవాల్‌ విసురుతున్నాడు. సెమీస్‌లో ప్రపంచ అగ్రర్యాంకు ప్లేయర్‌, స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ను ఓడించిన థీమ్‌.. అదే తీరైన ఆటతో డిఫెండింగ్‌ చాంప్‌కు షాకివ్వాలని కసరత్తు లు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఫ్రెంచ్‌ ఓపెన్లో రెండుసార్లు ఫైనల్‌ చేరినా నిరాశ ఎదురవడం తో.. ఆస్ట్రేలియా గడ్డపైనే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఖాతా తెరువాలని భావిస్తున్నాడు. మరి జొకో అనుభవం గెలుస్తుందా.. తర్వాతి తరంగా భావిస్తున్న థీమ్‌ దూకు డు పైచేయి సాధిస్తుందో చూడాలి.


తండ్రి కల నెరవేరింది

సోఫియా కెనిన్‌.. రష్యాలోని మాస్కోలో 1998లో జన్మించింది. సోవియట్‌ యూనియన్‌లో అప్పుడున్న పరిస్థితుల వల్ల తన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండదేమోనని భావించిన సోఫియా తండ్రి అలెగ్జాండర్‌ కెనిన్‌ ఆ తర్వాత కొన్నాళ్లకే కుటుంబంతో సహా శాశ్వతంగా  అమెరికాకు వలసవెళ్లాడు. న్యూయార్క్‌లో స్థిరపడి రాత్రివేళల్లో ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ పగటి పూట కంప్యూటర్‌ శిక్షణ, ఇంగ్లిష్‌ తరగతులకు వెళ్లేవాడు. మూడున్నరేండ్ల వయసులోనే సోఫియాకు టెన్నిస్‌ రాకెట్‌ పట్టించి ప్రోత్సహించాడు. చిన్నతనంలో కోచ్‌ల దగ్గర శిక్షణ ఇప్పించినా.. క్రమంగా తానే మార్గనిర్దేశకుడిగా మారాడు. ప్రస్తుతం కెనిన్‌కు ఆయనే కోచ్‌గా ఉన్నాడు. సోఫియా చిన్నతనం నుంచే అంచెలంచెలుగా అన్ని టోర్నీల్లోనూ రాణించింది. ప్రస్తుతం గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి.. తనను గొప్పస్థాయిలో చూడాలనుకున్న తండ్రి కలను నెరవేర్చింది.


logo