గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 30, 2020 , 14:22:31

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం..వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆష్లే ఔట్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం..వరల్డ్‌ నంబర్‌వన్‌  ఆష్లే ఔట్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌ 2020 టైటిల్‌ పోరులో అమెరికా తార సోఫియా కెనిన్‌, స్పెయిన్ స్టార్ ముగురుజ తలపడనున్నారు.

మెల్‌బోర్న్‌:  ఆస్ట్రేలియా ఓపెన్‌ 2020లో పెను సంచలనం. మహిళల సింగిల్స్‌  టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) యూఎస్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. ఫేవరెట్‌గా బరిలో దిగిన ఆష్లే ఓటమితో  మెల్‌బోర్న్‌ పార్క్‌ లో ఒక్కసారిగా నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. సొంతగడ్డపై సొంత అభిమానుల మధ్య నంబర్‌వన్‌ ఆష్లే ఓటమిపై  ఆస్ట్రేలియన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్‌లో బార్టీ వెనుకంజ వేసిన ప్రతిసారీ లెట్స్‌ గో బార్టీ.. లెట్స్‌ గో.. అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. 40ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌  చేరిన తొలి ఆసీస్‌ మహిళా ప్లేయర్‌గా నిలువాలనుకున్న ఆమె ఆశ నెరవేరలేదు. 

గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సోఫియా కెనిన్‌(అమెరికా) 7-6(6), 7-5తో వరల్డ్‌నంబర్‌ వన్‌ బార్టీని ఓడించింది.  ఆసీస్‌ అమ్మాయికి సెమీస్‌లో షాకిస్తూ 21ఏండ్ల  క్రీడాకారిణి కెనిన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ ఛాంపియన్‌పై గొప్పగా పోరాడిన కెనిన్‌ వరుస సెట్లలో గెలుపొంది టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సోఫియాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. 2008 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌ చేరిన అతిపిన్న వయస్కురాలిగా ఆమె ఘనత సాధించింది. 

తొలి సెట్‌లో ఆష్లే 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.  మ్యాచ్‌ ఆరంభంలో కొంత అసహనానికి గురైన సోఫియా తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ఇద్దరు ప్లేయర్లు  సర్వీస్‌లను కాపాడుకుంటూ ముందుకు సాగడంతో ఫలితం టైబ్రేకర్‌కు చేరింది.   టైబ్రేకర్‌లోనూ మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని విజయం సాధించింది.  రెండో సెట్‌లోనూ మంచి జోరు కనబరిచిన కెనిన్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. రెండో సెట్‌లో బార్టీ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అమెరికన్‌ ప్లేయర్‌ ముందు తేలిపోయింది. 

మరో మహిళల సింగిల్స్‌  సెమీస్‌లో స్పెయిన్ స్టార్ గార్బిని ముగురుజ అదరగొట్టింది. రొమేనియా భామ సిమోనా హలెప్ పై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. రసవత్తరంగా సాగిన సెమీఫైనల్లో ముగురుజ 7-6(8), 7-5తో హలెప్‌ ను మట్టికరిపించింది. ఆస్ట్రలియా ఓపెన్‌ 2020 టైటిల్‌ పోరులో అమెరికా తార  సోఫియా కెనిన్‌, ముగురుజ తలపడనున్నారు. logo
>>>>>>