బుధవారం 27 జనవరి 2021
Sports - Nov 26, 2020 , 02:46:35

సెలవిక

సెలవిక

  • గుండెపోటుతో సాకర్‌ దిగ్గజం మారడోనా కన్నుమూత 
  • శోకసంద్రంలో ఫుట్‌బాల్‌ ప్రపంచం  
  • 1960-2020

బ్యూనోస్‌ ఐరెస్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం, 1986 ఫిఫా ప్రపంచకప్‌ విజేత డిగో మారడోనా(60) కన్నుమూశారు. బుధవారం గుండెపోటుకు గురైన ఆయన మృతి చెందారు. ఈ నెల ఆరంభంలో చేయించుకున్న మెదడు శస్త్రచికిత్స విజయవంతమైనా.. హఠాత్తుగా గుండెపోటుకు గురై మారడోనా ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. అర్జెంటీనా తరఫున 91 మ్యాచ్‌లు ఆడిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాలర్‌ మారడోనా 34 గోల్స్‌ చేశారు. దేశం తరఫున నాలుగు ప్రపంచకప్‌ల్లో ప్రాతినిధ్యం వహించారు. 1986 మెగా టోర్నీలో జట్టుకు సారథ్యం వహించి అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ అందించారు. ఆ విశ్వటోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై మారడోనా చేసిన గోల్‌.. శతాబ్దానికే అత్యుత్తమ గోల్‌గా చరిత్రలో నిలిచిపోయింది. మరో గోల్‌ చేయి తాకి నమోదైందన్న ఆరోపణలు ఫేమస్‌ కావడంతో అది ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' గానూ పేరుతెచ్చింది. అలాగే 1990 ప్రపంచకప్‌లోనూ అర్జెంటీనాను మారడోనా ఫైనల్‌కు చేర్చారు. క్లబ్‌ కెరీర్‌లో బార్సిలోనా, నపోలీ తరఫున బరిలోకి దిగిన డిగో ఆ జట్లకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. నపోలీకి రెండు సిరీస్‌-ఏ టైటిళ్లను సాధించిపెట్టారు. 1991లో మాదక ద్రవ్యాలు వాడినట్టు డోప్‌ పరీక్షల్లో తేలడంతో మారడోనా 15 నెలల పాటు నిషేధానికి గురయ్యారు. ఆ తర్వాత 1994 ప్రపంచకప్‌లోనూ అర్జెంటీనాకు సారథ్యం వహించారు. మొత్తంగా 1997లో 37వ పుట్టిన రోజునే ప్రొఫెషనల్‌ కెరీర్‌కు మారడోనా వీడ్కోలు పలికారు. 2008 నుంచి 2010 వరకు అర్జెంటీనా జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత అమెరికా, మెక్సికో జట్లకు మార్గనిర్దేశం చేశారు. చాలా జట్లకు మేనేజర్‌గా వ్యవహరించిన మారడోనా..  చివరగా అర్జెంటీనా ప్రముఖ క్లబ్‌ జిమ్నాసియా డె లా ప్లాటా జట్టుకు కోచ్‌గా కొనసాగుతూనే కన్నుమూశారు. చివరి శ్వాస వరకు ఫుట్‌బాల్‌తోనే ప్రయాణించారు. 

హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌..


1986 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మారడోనా.. ఫైనల్లో పశ్చిమ జర్మనీని ఓడించి జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. ఫైనల్‌ చేరే క్రమంలో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో మారడోనా రెండు గోల్స్‌తో చెలరేగిపోయాడు. ఇందులో ఒకటి 66 గజాల దూరం నుంచి ఇంగ్లండ్‌ రక్షణ శ్రేణిని ఛేదిస్తూ దూసుకెళ్లిన బంతి ఒకటైతే.. మరొకటి ఫుట్‌బాల్‌ చరిత్రలోనే వివాదాస్పద గోల్‌గా మిగిలిపోయింది. డి ప్రాంతంలో మారడోనా హెడర్‌ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అతడి చేతిని తాకిన బంతి గోల్‌ పోస్ట్‌లోకి వెళ్లింది. కోలాహలంలో దాన్ని గుర్తించని రిఫరీ గోల్‌గా ప్రకటించగా.. ఆ తర్వాత రిప్లేలో చేయి తగిలినట్లు స్పష్టమైంది. దీంతో అది ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'గా చరిత్రకెక్కింది. ఇక అదే మ్యాచ్‌లో కొట్టిన మరో గోల్‌ ‘గోల్‌ ఆఫ్‌ సెంచరీ’గా ఎంపికైంది. 

జెర్సీ నంబర్‌కు ఆద్యుడు అతడే


భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ధరించే జెర్సీపై 10వ నంబర్‌ ఉండటం క్రీడాభిమానులందరికీ తెలిసిందే. ఫుట్‌బాల్‌ విషయానికి వస్తే లియోనెల్‌ మెస్సీ పదో నంబర్‌ జెర్సీతోనే బరిలో దిగుతాడు. అయితే ఈ జెర్సీ నెంబర్‌ల సంప్రదాయానికి ఆద్యుడు మారడోనే అని చెప్పాలి. అతడు 10వ నంబర్‌ జెర్సీతో బరిలో దిగిన తర్వాతే.. ఆ సంఖ్యకు విశ్వవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. 

ప్రొఫైల్‌...

పూర్తి పేరు: డిగో అర్మాండో మారడోనా  

పుట్టిన తేది: 30 అక్టోబర్‌ 1960 

మరణం:     25 నవంబర్‌ 2020  

అర్జెంటీనా అండర్‌-20: 15 మ్యాచ్‌లు: 8 గోల్స్‌ 

అర్జెంటీనా: 91 మ్యాచ్‌లు, 34 గోల్స్‌

క్లబ్‌ కెరీర్‌: 


అర్జెంటీనా జూనియర్స్‌ (1976-81)

బోకా జూనియర్స్‌ (1981-82)

బార్సిలోనా (1982-84)

నపోలీ (1984-91)

సెవిల్లా (1992-93)

న్యూవెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌ (1993-94) 

బోకా జూనియర్స్‌ (1995-97) 

ఫిఫా ప్రపంచకప్‌-1986(మెక్సికో)- అర్జెంటీనా విజేత, 1990-ఇటలీ- రన్నరప్‌, కోపా అమెరికా కప్‌-1989, ఫిఫా అండర్‌-20 ప్రపంచకప్‌, విజేత- 1979(జపాన్‌) 

గౌరవాలు 

ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ది సెంచరీ : 2000

దక్షిణ అమెరికా ఫుట్‌బాలర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : 1979, 1980 

ఫిఫా ప్రపంచకప్‌ గోల్డెన్‌ బాల్‌: 1986 

పిఫా వరల్డ్‌ కప్‌ ఆల్‌స్టార్‌ టీమ్‌ : 1986, 1990

వరల్డ్‌ సాకర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: 1986 

ఫుట్‌బాల్‌కు చేసిన సేవలకు బాలోన్‌ డిఓర్‌

(గోల్డెన్‌ బాల్‌) : 1995  

గోల్డెన్‌ ఫుట్‌(ఫిఫా లెజెండ్‌): 2003 

గ్లోబ్‌ సాకర్‌ అవార్డ్స్‌ ప్లేయర్‌ కెరీర్‌ అవార్డు : 2012 

ఆల్‌ టైమ్‌ ప్రపంచ సాకర్‌ గ్రేటెస్ట్‌ ఎలెవెన్‌ : 2013 

ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌(ఫోర్‌ ఫోర్‌ టూ మ్యాగజీన్‌): 2018

ఇటాలియన్‌ ఫుట్‌బాల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌: 2014 

విషాద వార్త విన్నాను


నేను నా ప్రాణ మిత్రుడిని కోల్పోయాను,  ఈ ప్రపంచం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. శోక సంద్రంలో ఉన్న అతని కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఏదో ఒక రోజు స్వర్గంలో మనమిద్దరం కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతామన్న నమ్మకముంది’ 

- పీలే, బ్రెజిల్‌ సాకర్‌ దిగ్గజం 


logo