సెంచ‌రీలతో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమిండియా టార్గెట్ 375

Nov 27, 2020 , 13:31:53

సిడ్నీ: ఇండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు. కెప్టెన్ ఫించ్‌, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచ‌రీలు బాద‌డంతో టీమిండియా ముందు 375 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా. కంగారూ బ్యాట్స్‌మెన్ జోరు ముందు టీమిండియా బౌల‌ర్లు తేలిపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్ కూడా ఆసీస్ భారీ స్కోరుకు కార‌ణ‌మైంది. స్మిత్ కేవ‌లం 62 బంతుల్లోనే సెంచ‌రీ బాదాడు. 66 బంతుల్లో 105 ప‌రుగులు చేయ‌గా.. కెప్టెన్ ఫించ్ 124 బంతుల్లో 114 ప‌రుగులు చేశాడు. మ‌ధ్య‌లో మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 19 బంతుల్లోనే 45 ప‌రుగులు చేశాడు. మ్యాక్సీ 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాద‌గా.. స్మిత్ 11 ఫోర్లు, 4 సిక్స‌ర్లు కొట్టాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి టీమిండియా స్టార్ బౌల‌ర్ బుమ్రా త‌న ప‌ది ఓవ‌ర్ల కోటాలో 73 ప‌రుగులు స‌మ‌ర్పించుకోగా.. చాహ‌ల్ 89, సైనీ 83 ప‌రుగులు ఇచ్చారు. ష‌మి మాత్ర‌మే 59 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవ‌డం విశేషం. 

ఫించ్‌, వార్న‌ర్ తొలి వికెట్‌కు 156 ప‌రుగులు జోడించారు. త‌ర్వాత వార్న‌ర్ ఔట్ కాగా.. స్మిత్‌తో క‌లిసి రెండో వికెట్‌కు మ‌రో 108 ప‌రుగులు జోడించాడు ఫించ్‌. వ‌న్డేల్లో 17వ సెంచ‌రీ పూర్తి చేసిన కాసేప‌టికే ఔట‌య్యాడు. ఆ వెంట‌నే స్టాయినిస్ కూడా తొలి బంతికే పెవిలియ‌న్ చేరాడు. అయితే ఆ త‌ర్వాతే అస‌లు విధ్వంసం మొద‌లైంది. స్మిత్‌తో జ‌త క‌లిసి మ్యాక్స్‌వెల్ టీమిండియా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఈ ఇద్ద‌రూ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగిపోయారు. ఈ ఇద్ద‌రూ నాలుగో వికెట్‌కు కేవ‌లం 25 బంతుల్లో 57 ప‌రుగులు జోడించ‌డం విశేషం. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD