బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Jan 22, 2021 , 00:39:07

నాన్నకు ప్రేమతో.. ప్రతీ వికెట్‌ ఆయనకే అంకితం

నాన్నకు ప్రేమతో.. ప్రతీ వికెట్‌ ఆయనకే అంకితం

  • సవాళ్లను ఇష్టపడుతా 
  • భవిష్యత్‌లో ఇదే జోరు కొనసాగిస్తా 

కష్టాల కడలిని ఈదుకుంటూ తనను ఈ స్థాయికి తెచ్చిన తండ్రి మృతిచెందినా.. కడచూపునకు కూడా నోచుకోకుండా దేశ బాధ్యతే ముందు అని ఆస్ట్రేలియాలోనే ఉండి టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయంలో పాలుపంచుకున్న హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌.. స్వదేశంలో అడుగుపెట్టడంతోనే తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించాడు. తనను ఈ స్థాయికి తెచ్చిన నాన్న లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక కుటుంబసభ్యులతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం తన పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

సుదీర్ఘ ఫార్మాట్‌లో నేను దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది మా నాన్న కల. అది నెరవేర్చగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. ఆసీస్‌ సిరీస్‌లో పడగొట్టిన వికెట్లు మా నాన్నకు అంకితమిచ్చా. సిడ్నీ టెస్టులో ఐదు వికెట్లు తీశాక నేను, మయాంక్‌ అగర్వాల్‌ కలిసి చేసుకున్న సంబురాలే దీనికి నిదర్శనం. కష్టకాలంలో జట్టు యాజమాన్యం నాకు మద్దతుగా నిలిచింది. కుటుంబ సభ్యులతో పాటు కాబోయే శ్రీమతి కూడా వెన్నంటి నిలువడంతో మనసును ఆట మీద లగ్నం చేయగలిగా. ఇంట్లోకి రాగానే అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చింది. ఆమెకు సర్దిచెప్పడం చాలా కష్టమైంది. అమ్మ ముందు ధైర్యంగా ఉండేందుకు ఎంతో ప్రయత్నించా. ఈ ప్రదర్శనను ఇక్కడితో వదిలేసి ముందుకు సాగుతా. భవిష్యత్తులో జట్టు అవసరాలకు తగ్గట్లు టీమ్‌ఇండియా విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాలనుకుంటున్నా. 

ఇద్దరిదీ ఒకే తీరు..

విరాట్‌ కోహ్లీ సారథ్యంలో చాలా మ్యాచ్‌లు ఆడా. అతడు మైదానంలో చాలా దూకుడుగా కనిపిస్తాడు. అయితే రహానే తీరు కూడా ఇంచుమించు అలాంటిదే. కానీ బయటకు కనిపించదు. ఇద్దరి కెప్టెన్సీలో పెద్ద తేడా ఉండదు. కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చాక యువ ఆటగాళ్లలో రహానే ఆత్మవిశ్వాసం నింపాడు. సుందర్‌, సైనీ, నటరాజన్‌, శార్దూల్‌తో పాటు నాకు చాలా విలువైన సూచనలు ఇచ్చేవాడు. 

అనుభవం పనికొచ్చింది

ఆసీస్‌ గడ్డపై బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఐపీఎల్‌ అనుభవం పనికొచ్చింది. లీగ్‌లో  వార్నర్‌కు ఇన్‌స్వింగర్లు వేసేవాడిని. దాంతోనే అక్కడ కూడా ఔట్‌ చేశా. ఇలాంటి ప్రదర్శనే భవిష్యత్తులోనూ కొనసాగించాలనుకుంటున్నా. విజయాన్ని తలకెక్కించుకోకుండా ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం సమాయత్తమవుతా. 

సవాళ్లను ఇష్టపడతా..

ఈ సిరీస్‌లో నిజానికి కాస్త ఒత్తిడికి లోనయ్యా. వ్యక్తిగతంగా తండ్రిని కోల్పోవడంతో పాటు బయోబబుల్‌, జాత్యహంకార వ్యాఖ్యలు నన్ను ఇబ్బంది పెట్టాయి. అయితే సహజంగా నేను సవాళ్లను ఇష్టపడే వ్యక్తిని. వాటి వల్లే కసి పెరిగి.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బౌలింగ్‌ చేశా. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా బంతులు విసిరా. 

ప్రతిభే ప్రధానం..

ఆటపై ఇష్టంతో.. అందుకు తగ్గ ప్రణాళికలు రచించుకుంటూ కష్టపడితే ప్రతీఒక్కరికి అవకాశం దక్కుతుంది. హైదరాబాద్‌ క్రికెట్‌లో అవినీతి జరుగుతున్నది అనడం అవాస్తవం. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. 

అంపైర్లు ఆఫర్‌ ఇచ్చారు

సిడ్నీ టెస్టులో అభిమానుల నుంచి జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురవుతున్నాయనే అంశాన్ని అంపైర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పుడు.. ఫీల్డ్‌లో ఉన్న అంపైర్లు పాల్‌ రైఫెల్‌, విల్సన్‌ మీరు కావాలనుకుంటే మైదానాన్ని వీడొచ్చు అని పేర్కొన్నారు. అందుకు అజ్జూ భాయ్‌ (రహనే) ఒప్పుకోలేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మైదానంలోనే కొనసాగుతాం అని చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌కు ఫిర్యాదు చేశాం. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ దూషణలు నన్ను మానసికంగా బలవంతుడిని చేశాయి. ఆ తర్వాత నాలో పట్టుదల ఇంకా ఎక్కువైంది.  

విరాట్‌ పెద్దన్న లాంటోడు

కెరీర్‌ ఆరంభం నుంచి విరాట్‌ కోహ్లీ నన్ను గమనిస్తున్నాడు. నా బౌలింగ్‌లో లోపాలేమైనా ఉంటే వాటిని సరిదిద్దుకునేలా సలహాలిస్తాడు. ప్రదర్శన బాగాలేకపోతే అండగా నిలుస్తాడు. ఒత్తిడికి లోనుకావొద్దని, ఆందోళన చెందకుండా ముందుకు సాగాలని చెబుతాడు. జట్టులో సీనియర్‌, జూనియర్‌ అనే తేడా ఉండదు. జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి రెండు టెస్టులు ఆడినప్పుడు.. బంతి బంతికి సూచనలు ఇచ్చేవాడు.

ఆ వికెట్‌ ప్రత్యేకం..

టెస్టు సిరీస్‌లో పడగొట్టిన 13 వికెట్లలో మార్నస్‌ లబుషేన్‌ది ఎంతో ప్రత్యేకం. చాలా శ్రమించిన తర్వాత దక్కింది. ఐదు వికెట్ల ఘనత అందుకోవడం సంతృప్తినిచ్చింది. బ్రిస్బేన్‌ టెస్టులో నన్ను నేను ప్రధాన పేసర్‌గా భావించుకోలేదు. జట్టు అవసరాలకు తగ్గట్లు బౌలింగ్‌ చేయాలనుకున్నా. 

బిర్యానీ తినలేదు..

చాన్నాళ్ల తర్వాత నగరానికి వచ్చాను. అయినా నాకు ఇష్టమైన హైదరాబాదీ బిర్యానీని ముట్టుకోలేదు. అమ్మ చేతి వంటే తిన్నాను. 

నా ఫస్ట్‌ కెప్టెన్‌

హైదరాబాద్‌ తరఫున తొలి రంజీ మ్యాచ్‌ (2015) ఆడిన సమయంలో హనుమ విహారి జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టించాలో సలహాలు ఇచ్చేవాడు. ఆసీస్‌లో ఆడేటప్పుడు ఒకరిని ఒకరం ప్రోత్సహించుకునేవాళ్లం.

తండ్రికి నివాళి.. 

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరిన సిరాజ్‌ ఇంటికి వెళ్లకుండా.. నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. గతేడాది అక్టోబర్‌ 26న సిరాజ్‌ తొలిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికై ఆస్ట్రేలియా వెళ్లగా.. నవంబర్‌ 20న తండ్రి మహమ్మద్‌ గౌస్‌ మృతిచెందారు. ఆ సమయంలో భారత జట్టు యాజమాన్యం స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసినా.. తండ్రి కన్న కలను నెరవేర్చేందుకు సిరాజ్‌ అక్కడే ఉండిపోయాడు. క్వారంటైన్‌ నిబంధనల నేపథ్యంలో తిరిగి జట్టుతో కలువడం కష్టం కావడంతో బాధను దిగమింగుకొని ఆసీస్‌లోనే కొనసాగిన సిరాజ్‌.. చివరి మూడు టెస్టుల్లో బరిలోకి దిగాడు. సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక (13) వికెట్లు పడగొట్టి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ గెలువడం ప్రధాన పాత్ర పోషించాడు.

VIDEOS

logo