టోక్యో: అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ గురువారం జరిగే వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్ నుంచి తప్పుకున్నది. మానసిక ఆరోగ్యం సరిగా లేని కారణంగా.. సోమవారం కూడా ఆమె వుమెన్స్ టీమ్ ఫైనల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా పతకాల వేటకు బ్రేక్‌పడినట్లు అయ్యింది. జిమ్నాస్టిక్స్‌లో ఆరుసార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన బైల్స్ ఈసారి కూడా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది. కానీ సోమవారం ఆమె అనూహ్యంగా పోటీ నుంచి విత్‌డ్రా అయ్యింది. ఇక గురువారం జరిగే వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఇవాళ అమెరికా జిమ్నాస్టిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వైద్య సూచనల మేరకు బైల్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రతి రోజు బైల్స్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు. వచ్చే వారం జరిగే వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్‌లో బైల్స్ పాల్గొంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే క్వాలిఫికేషన్స్ రౌండ్లో 9వ హైయ్యెస్ట్ స్కోర్ వచ్చిన జేడ్ క్యారీ .. బైల్స్ స్థానంలో ఆల్ రౌండ్ ఈవెంట్లో పాల్గొననున్నది. బైల్స్‌కు మనస్పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, ఆమె సాహసోపేత నిర్ణయాన్ని గౌరవిస్తామని అమెరికా జిమ్నాస్టిక్ సంఘం ఓ ప్రకటనలో పేర్కొన్నది.