బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Sep 08, 2020 , 00:46:51

బ్యాడ్‌లక్‌ జొకో

బ్యాడ్‌లక్‌ జొకో

  • లైన్‌ అంపైర్‌పైకి బంతి  
  •  యూఎస్‌ ఓపెన్‌లో  సెర్బియా వీరుడిపై వేటు
  •   క్షమాపణ కోరిన నోవాక్‌ 

గత ఏడు గ్రాండ్‌స్లామ్‌లలో ఐదింటిని సొంతం చేసుకున్న వీరుడు.. పచ్చగడ్డిలో అడుగుపెట్టాడంటే.. ప్రత్యర్థిని మట్టికరిపించే వరకు వదలని ధీరుడు..

మహామహులను ఓడించి ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగిన సెర్బియా స్టార్‌ నోవాక్‌ జొకోవిచ్‌కు అనుకోని షాక్‌ తగిలింది. టాప్‌ ఆటగాళ్ల గైర్హాజరీలో యూఎస్‌ ఓపెన్‌లో జొకోకు తిరుగులేదనుకుంటే.. క్షణికావేశంలో అతడు చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అనుకోకుండా బంతిని లైన్‌ అంపైర్‌పైకి కొట్టిన జొకోవిచ్‌ను నిర్వాహకులు టోర్నీ నుంచి తప్పించారు. బిగ్‌ త్రీ అందుబాటులో లేకపోవడంతో.. న్యూయార్క్‌లో ఈసారి కొత్త విజేత ఆవిర్భవించడం ఖాయమే..!

  న్యూయార్క్‌: కరోనా వైరస్‌ విజృంభణకు తోడు గాయాలు వేధిస్తుండటంతో ఇద్దరు దిగ్గజాలు రోజర్‌ ఫెదరర్‌, రాఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నారు. ఇక మిగిలిన ‘డ్రా’లో కూడా ప్రమాదకర ప్రత్యర్థులెవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ నంబర్‌వన్‌, టాప్‌సీడ్‌ నోవాక్‌ జొకోవిచ్‌ గ్రాండ్‌స్లామ్‌ చేజిక్కించుకోవడం ఖాయమే అనుకున్నారంతా. ఇప్పటికే 17 గ్రాండ్‌స్లామ్‌లు ఖాతాలో వేసుకున్న సెర్బియా వీరుడికి తిరుగులేదనుకుంటున్న తరుణంలో యూఎస్‌ ఓపెన్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా చేసిన తప్పిదం జొకోవిచ్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఆదివారం రాత్రి పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్‌ ఆటగాడు పాబ్లో కరెనో బుస్టాతో జొకోవిచ్‌ తలపడ్డాడు. తొలిసెట్‌లో కాస్త వెనుకబడ్డ జొకో.. అన్యమనస్కంగా తన చేతిలో ఉన్న బంతిని కోర్టు పక్కకు రాకెట్‌తో కొట్టాడు. అది నేరుగా వెళ్లి లైన్‌ అంపైర్‌కు తగలడం.. ఆమె ఒక్కసారిగా కుప్పకూలడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో నిబంధనల ప్రకారం జొకోను టోర్నీ నుంచి తొలగిస్తున్నట్లు యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు తెలిపారు.

   పది నిమిషాలు చర్చించాక..

   ఈ అంశంపై టోర్నీ రెఫరీ సొరెన్‌ ఫ్రీమెల్‌, సూపర్‌వైజర్‌ ఆండ్రియాస్‌ ఎగ్లీ.. జొకోవిచ్‌తో 10 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తాను కావాలని బంతిని కొట్టలేదని జొకో మొరపెట్టుకున్నా.. నిర్వాహకులు దయదల్చలేదు. దీంతో పాటు టోర్నీలో సాధించిన ర్యాంకింగ్‌ పాయింట్లు, మూడు రౌండ్లు దాటినందుకు ఇవ్వాల్సిన రూ.1.83 కోట్ల నగదును కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కోర్టును వీడిన జొకో ఆ తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు తెలిపాడు. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలోనే.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా టోర్నీ నిర్వహించి కొవిడ్‌-19 బారిన పడి టెన్నిస్‌ ప్రపంచంతో చివాట్లు తిన్న జొకోవిచ్‌ తాజా ఘటనతో మరోసారి తాను కోరుకోకుండానే వార్తల్లోకెక్కాడు. 

      వరుస విజయాలకు బ్రేక్‌..

  గత 29 మ్యాచ్‌ల్లో జొకోకు ఓటమన్నదే తెలియదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అతడు నాలుగోసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్‌ (20), నాదల్‌ (19)ను సమీపించాలని భావించాడు. అదే లక్ష్యంతో వరుస విజయాలు సాధించుకుంటూ ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. తొలి సెట్‌లో 5-6తో సర్వీస్‌ కోల్పోయి కాస్త అసహనంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జొకో కొట్టిన బంతి కోర్టుకు ఎడమవైపు నిల్చున్న లైన్‌ అంపైర్‌ మెడకు తగిలింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పుకూలింది. ‘ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జొకోవిచ్‌ తన వాదన వినిపించాడు. అయితే వాస్తవం కండ్ల ముందు కనిపిస్తున్నది. లైన్‌ అంపైర్‌ గాయపడ్డారు. దీంతో నిబంధనల ప్రకారం జొకోవిచ్‌ను టోర్నీ నుంచి తొలగించాం. నంబర్‌వన్‌ ర్యాంకర్‌ అయినా మరో ఆటగాడైనా నిబంధనలు ఒక్కటే’ అని ఫ్రీమెల్‌ అన్నారు.

    క్వార్టర్స్‌లో ఓసాక

  మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నవోమి ఒసాక (జపాన్‌) 6-4, 6-4తో కొంటవెయిట్‌ (ఎస్తోనియా)పై నెగ్గి క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. పురుషుల సింగిల్స్‌లో షపొలోవ్‌, జ్వెరెవ్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

  గతంలోనూ ఇలా.. 

 2017  డేవిస్‌ కప్‌  సందర్భంగా కెనడా ఆటగాడు డెనిస్‌ షపొలోవ్‌ కూడా ఇలాగే వెనుదిరిగాడు. అనుకోకుండా అతడు కొట్టిన బంతి చైర్‌ అంపైర్‌కు తాకడంతో అతడిని టోర్నీ నుంచి తప్పించారు. అంతకుముందు 1995 వింబుల్డన్‌లో బాల్‌ గర్ల్‌ తలపైకి బంతిని కొట్టిన కారణంగా టిమ్‌ హెన్‌మెన్‌ను గ్రాండ్‌స్లామ్‌ నుంచి తొలగించారు. 

ఈ ఘటన నన్ను బాధిస్తున్నది. లైన్‌ అంపైర్‌ను పరిశీలించాను. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. ఇదంతా అనుకోకుండా జరిగింది. ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు మనసారా క్షమాపణలు చెబుతున్నా. టో ర్నీ నుంచి తొలగించడం బాధగా ఉంది. నేను చేసింది తప్పే. ఇంటికి వెళ్లి దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఇది నాకు గుణపాఠం లాంటిది. యూఎస్‌ ఓపెన్‌తో పాటు ఈ ఘటన వల్ల ఇబ్బందిపడ్డ ప్రతీ ఒక్కరినీ మన్నించమని కోరుతున్నా. 

- జొకోవిచ్‌ 

గ్రాండ్‌స్లామ్‌ రూల్‌బుక్‌ ప్రకారం.. ఏ ఆటగాడైనా కోర్టులో ఉద్దేశపూర్వకంగా కానీ, బాధ్యతారహితంగా కానీ ఎవరిపైకైనా బంతి విసిరి.. వారిని గాయపరిస్తే అలాంటి ఆటగాడిని టోర్నీనుంచి తొలగిస్తారు. logo