గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 27, 2020 , 01:10:33

కోల్‌కతా బోణీ

కోల్‌కతా బోణీ

  • సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్‌కు మరోసారి నిరాశ ఎదురైంది.
  • మొదటి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిన హైదరాబాద్‌.. 
  • కోల్‌కతాపై కూడా కమాల్‌ చూపలేక పోయింది.
  • గిల్‌ అర్ధశతకం.. పాండే శ్రమ వృథా
  • హైదరాబాద్‌కు రెండో పరాజయం

అబుదాబి: సీజన్‌ ఆరంభం నుంచి టాస్‌ గెలిచిన సారథులంతా టార్గెట్‌ ఛేజ్‌ చేసేందుకు మొగ్గుచూపుతుంటే.. డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తన బౌలర్లపై ఉన్న నమ్మకంతో మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే స్లో పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో.. సన్‌రైజర్స్‌ ప్రత్యర్థి ముందు ఓ మాదిరి లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఫలితంగా శనివారం ఇక్కడి షేక్‌ జాయెద్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ సేన 0 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన వార్నర్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (38 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. డేవిడ్‌ వార్నర్‌ (36), వృద్ధిమాన్‌ సాహా (30) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు బరిలో దిగిన కోల్‌కతా 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (62 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో మెరువగా.. మోర్గాన్‌ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. 

పాండే పోరాటం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్‌లో దంచికొట్టిన బెయిర్‌స్టో (5).. కమిన్స్‌ వేసిన నాలుగో ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యా డు. చక్కటి షాట్లతో అలరించిన వార్నర్‌ కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. దీంతో సాహాతో కలిసి మనీశ్‌ పాండే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. స్లో వికెట్‌పై ఈ జోడీ సింగిల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతో రన్‌రేట్‌ నెమ్మదించింది. 10 ఓవర్లలో 61/2తో నిలిచిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాత కూడా గేరు మార్చలేకపోయింది. అడపాదడపా భారీ షాట్లు ఆడిన పాండే అర్ధశతకం అనంతరం ఔట్‌ కాగా.. చివర్లో నబి (11), సాహా కొన్ని విలువైన పరుగులు చేశారు.  

గిల్‌ యాంకర్‌ రోల్‌..

భారీ హిట్టర్లు ఉన్న కోల్‌కతా కూడా ఛేజింగ్‌లో ధాటిగా ఆడలేకపోయింది. నరైన్‌ (0) ఖాతా తెరువకుండానే వెనుదిరగగా.. రాణా (13 బంతుల్లో 26; 6 ఫోర్లు) ఉన్నంత సేపు ఎడాపెడా ఫోర్లతో బెంబేలెత్తించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ కార్తీక్‌ (0) డకౌట్‌ అయ్యాడు. ఆరంభం నుంచి మెరుగ్గా ఆడిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 42 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అతడికి మోర్గాన్‌ చక్కటి సహకారం అందించడంతో మరో వికెట్‌ కోల్పోకుండా కోల్‌కతా విజయతీరాలకు చేరింది. 

స్కోరు బోర్డు

హైదరాబాద్‌: వార్నర్‌ (సి అండ్‌ బి) వరుణ్‌ 36, బెయిర్‌స్టో (బి) కమిన్స్‌ 5, పాండే (సి అండ్‌ బి) రస్సెల్‌ 51, సాహా (రనౌట్‌) 30, నబి (నాటౌట్‌) 11, అభిషేక్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 142/4.  వికెట్ల పతనం: 1-24, 2-59, 3-121, 4-138, బౌలింగ్‌: నరైన్‌ 4-0-31-0, కమిన్స్‌ 4-0-19-1, శివమ్‌ 2-0-15-0, కుల్దీప్‌ 2-0-15-0, వరుణ్‌ 4-0-25-1, నాగర్‌కోటి 2-0-17-0, రస్సెల్‌ 2-0-16-1.

కోల్‌కతా: గిల్‌ (నాటౌట్‌) 70, నరైన్‌ (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ 0, రాణా (సి) సాహ (బి) నటరాజన్‌ 26, కార్తీక్‌ (ఎల్బీ) రషీద్‌ 0, మోర్గాన్‌ (నాటౌట్‌) 42, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 18 ఓవర్లలో 145/3. వికెట్ల పతనం: 1-6, 2-43, 3-53, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-29-0, ఖలీల్‌ 3-0-28-1, నటరాజన్‌ 3-0-27-1, రషీద్‌ 4-0-25-1, నబీ 4-0-23-0, అభిషేక్‌ 1-0-11-0.