గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 06, 2020 , 01:54:19

బెంగళూరుపై శ్రేయస్‌ సేన విజయం

బెంగళూరుపై శ్రేయస్‌ సేన విజయం

  • మెరిసిన స్టొయినిస్‌, పృథ్వీ షా, రబాడ

బ్యాటింగ్‌ బలాన్నే నమ్ముకొని బరిలో దిగిన బెంగళూరు.. టాపార్డర్‌ విఫలమవడంతో పరాజయం పాలైతే.. యువ ఆటగాళ్ల దమ్ముతో దుమ్మురేపిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పృథ్వీషా కళాత్మక ఇన్నింగ్స్‌కు స్టొయినిస్‌ మెరుపులు తోడవడంతో ఢిల్లీ భారీ స్కోరు చేస్తే.. ఫించ్‌, డివిలియర్స్‌, పడిక్కల్‌, మొయిన్‌ అలీ విఫలమవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కోహ్లీ కాసేపు క్రీజులో నిలిచినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 

దుబాయ్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ సీజన్‌లో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్టోయినిస్‌ (26 బంతుల్లో 53 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పృథ్వీ షా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టగా.. రిషబ్‌ పంత్‌ (37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్‌ (32) ఆకట్టుకున్నారు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్‌ సిరాజ్‌ (2/34) ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోహ్లీ సేన 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌. ఢిల్లీ బౌలర్లలో రాబాడ 4, నోర్జే, అక్షర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్‌  పటేల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

టాప్‌ విఫలం

ఛేజింగ్‌లో బెంగళూరు ఏ దశలోనూ పోటీలో నిలువలేకపోయింది. లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన పడిక్కల్‌ (4) త్వరగానే వెనుదిరగగా..  మూడు సార్లు లైఫ్‌ దక్కిన అరోన్‌ ఫించ్‌ (13) వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. డివిలియర్స్‌ (9) ఎక్కువసేపు నిలువకపోవడంతో బెంగళూరు కష్టాల్లో కూరుకుపోయింది.  విరాట్‌ కాసేపు క్రీజులో నిలిచినా.. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోతుండటంతో.. భారీ షాట్‌కు యత్నించిన మొయిన్‌ అలీ (11)  ఔటయ్యాడు. కాసేపటికి కోహ్లీని రబాడా ఔట్‌ చేయడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది.  సుందర్‌ (17), శివమ్‌ దూబే (11) అద్భుతాలు చేయలేకపోయారు. 

పృథ్వీ స్టార్ట్‌.. స్టొయినిస్‌ ఫినిష్‌..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు చక్కటి ఆరంభం లభించింది. ఉడాన వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాదిన పృథ్వీ షా.. సైనీకి సిక్సర్‌తో స్వాగతం పలికాడు. చాహల్‌ ఓవర్‌లో షా 6,4 బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. సిరాజ్‌ తన తొలి ఓవర్‌లోనే దూకుడు మీదున్న పృథ్వీ షాను పెవిలియన్‌ పంపాడు. కాసేపటికే ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (11) వెనుదిరిగారు. మిడిల్‌ ఓవర్స్‌లో బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో పరుగుల రాక గగనమైంది. ఫలితంగా 13వ ఓవర్లోగానీ ఢిల్లీ 100 పరుగుల మైలురాయిని దాటింది. ఆ తర్వాత స్టొయినిస్‌, పంత్‌ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అలీ ఓవర్‌లో 6,4 కొట్టిన స్టొయినిస్‌.. సైనీ ఓవర్‌లో 6,4,4 బాదాడు. భారీ షాట్లతో భయపెడుతున్న పంత్‌ను సిరాజ్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీ రెండొందల మార్కు దాటలేకపోయింది. 

కోహ్లీ.. బంతికి ఉమ్మి రాయబోయి

ఢిల్లీతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బంతికి ఉమ్మి రాయబోయాడు. సైనీ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో పృథ్వీ షా కొట్టిన బంతిని షార్ట్‌కవర్‌లో అందుకున్న విరాట్‌.. బంతిపై ఉమ్మి రాసేందుకు సిద్ధమై.. మార్గదర్శకాలు గుర్తుకువచ్చి ఒక్కసారిగా ఆగిపోయాడు. తాను బంతిపై సలీవా రాయలేదంటూ చిరునవ్వుతో అంపైర్‌కు తెలిపే ప్రయత్నం చేశాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సలీవాపై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

అశ్విన్‌ మన్కడింగ్‌ వార్నింగ్‌

గతేడాది ఐపీఎల్‌లో మన్కడింగ్‌ చేసి వార్తల్లో నిలిచిన రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ మ్యాచ్‌లోనూ అలాంటి అవకాశం వచ్చినా.. వదిలేశాడు. తన బౌలింగ్‌లో నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న ఫించ్‌ బంతి వేయకముందే క్రీజు దాటినా.. అతడిని వెనక్కి పిలిచి ఆ తర్వాత తిరిగి బంతి విసిరాడు.

శభాష్‌ సిరాజ్‌ 

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ఆకట్టుకున్నాడు. పవర్‌ప్లే తర్వాత బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్‌.. తన తొలి ఓవర్‌లోనే పృథ్వీ షాను ఔట్‌ చేసి బెంగళూరుకు బ్రేక్‌ అందించాడు. బౌన్సర్‌తో షాను ఔట్‌  చేసిన సిరాజ్‌.. ఆఖర్లో పంత్‌ను స్లో బంతితో బుట్టలో వేసుకున్నాడు. 

స్కోరు బోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) డివిలియర్స్‌ (బి) సిరాజ్‌ 42, ధావన్‌ (సి) అలీ (బి) ఉడాన 32, శ్రేయస్‌ (సి) పడిక్కల్‌ (బి) అలీ 11, పంత్‌ (బి) సిరాజ్‌ 37, స్టొయినిస్‌ (నాటౌట్‌) 53, హెట్‌మైర్‌ (నాటౌట్‌) 11,  ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 196/4. వికెట్ల పతనం: 1-68, 2-82, 3-90, 4-179, బౌలింగ్‌: ఉడాన 4-0-40-1, సుందర్‌ 4-0-20-0, సైనీ 3-0-48-0, చాహల్‌ 3-0-29-0, సిరాజ్‌ 4-0-34-2, అలీ 2-0-21-1. 

బెంగళూరు: పడిక్కల్‌ (సి) స్టొయినిస్‌ (బి) అశ్విన్‌ 4, ఫించ్‌ (సి) పంత్‌ (బి) అక్షర్‌ 13, కోహ్లీ (సి) పంత్‌ (బి) రబాడ 43, డివిలియర్స్‌ (సి) ధావన్‌ (బి) నోర్జే 9, మొయిన్‌ అలీ (సి) హెట్‌మైర్‌ (బి) అక్షర్‌ 11, సుందర్‌ (సి) అశ్విన్‌ (బి) రబాడ 17, దూబే (బి) రబాడ 11, ఉడాన (సి) అయ్యర్‌ (బి) రబాడ 1, సైనీ (నాటౌట్‌) 12, సిరాజ్‌ (బి) నోర్జే 5, చాహల్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 137/9. వికెట్ల పతనం: 1-20, 2-27, 3-43, 4-75, 5-94, 6-115, 7-118, 8-119, 9-127, బౌలింగ్‌: రబాడ 4-0-24-4, నోర్జే 4-0-22-2, అశ్విన్‌ 4-0-26-1, అక్షర్‌ 4-0-18-2, హర్షల్‌ 4-0-43-0.