గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 14, 2020 , 21:19:42

DC vs RR : మెరిసిన ధావన్‌, అయ్యర్‌

DC vs RR : మెరిసిన ధావన్‌, అయ్యర్‌

దుబాయ్: ‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు  చేసింది.  ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(57: 33 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(53: 43 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో పోరాడే స్కోరు సాధించింది. రాజస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌(3/19) ఢిల్లీని బాగా ఇబ్బంది పెట్టాడు. జయదేవ్‌ ఉనద్కత్‌ రెండు వికెట్లు తీయగా కార్తీక్‌ త్యాగీ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి డెత్‌ ఓవర్లలోనూ ఢిల్లీ భారీగా పరుగులు  రాబట్టలేకపోయింది. 

టాస్‌ గెలవగానే మిగతా జట్లలాగే  ఢిల్లీ కూడా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.  రాజస్థాన్‌  పేసర్‌  జోఫ్రా ఆర్చర్‌  ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సమర్థవంతంగా కట్టడి చేశాడు.  ఆర్చర్‌ వేసిన మొదటి ఓవర్‌ తొలి  బంతికే షా బౌల్డ్‌ అయ్యాడు.  మళ్లీ ఆర్చర్‌ వేసిన మూడో ఓవర్‌లోనే రహానె(2) పెవిలియన్‌ చేరాడు.  ఈ దశలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్‌ ధావన్‌, కెప్టెన్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.  కార్తీక్‌ త్యాగీ వేసిన  ఐదో ఓవర్లో ధావన్‌ రెండు ఫోర్లు కొట్టి 14 రన్స్‌ రాబట్టాడు.   పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ  47/2తో నిలిచింది.   స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్‌ ధావన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.  రాజస్థాన్‌ బౌలర్లపై విరుచుకుపడి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.

ధావన్‌ ఔటైనా అయ్యర్‌ ధనాధన్‌  బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఈ జోడీ పటిష్ఠ రాజస్థాన్‌ బౌలర్లను ఎదుర్కొని 80కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.  శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 12 ఓవర్లో  ధావన్‌..కార్తీక్‌ త్యాగీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఉనద్కత్‌ వేసిన 15వ ఓవర్లో  రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్‌ 17 రన్స్‌ రాబట్టాడు.   కార్తీక్‌ త్యాగీ వేసిన 16వ ఓవర్లో  అయ్యర్‌..ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరడంతో స్కోరు వేగం తగ్గింది.  ఆఖర్లో ప్రమాదకర స్టాయినీస్(18), అలెక్స్‌ కేరీ(14) పెద్దగా హిట్టింగ్‌ చేయలేకపోయారు.  చివరి 5 ఓవర్లలో ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 32 రన్స్‌ మాత్రమే చేయగలిగింది.